
పీఠాధిపతి నియామకంపై త్వరలో నిర్ణయం
హుబ్లీ: కూడల సంగమ పంచమసాలి పీఠానికి ప్రత్యామ్నాయ పీఠాధిపతి నియమాకంపై చర్చ జరుగుతోంది. త్వరలో నిర్ణయం తీసుకుంటామని అఖిల భారత లింగాయత పంచమసాలి సమాజ ట్రస్ట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ బసవ జయ మృత్యుంజయ స్వామికి 2019లో ట్రస్ట్ ద్వారా నోటీసులు ఇవ్వగా సరిదిద్దుకుంటానని స్వామి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఇంత జరిగిన కూడా స్వామి తన నడవడికను సరిదిద్దుకోకుండా ఓ పార్టీకి, కొందరు నాయకుల చేతిలో కీలుబొమ్మగా నడుచుకుంటున్నారన్నారు. పీఠాధిపతి ధర్మ ప్రచారం చేస్తూ బసవతత్వాల అమలు కోసం కృషి చేయాలి. అయితే స్వామి లోకసంచారిగా మారి బెంగళూరు, హుబ్లీ, బెళగావిలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇల్లు చేసుకొని ధర్మకార్యాన్ని మరచిపోయారు. అంతేగాక మలప్రభ కాలువ గట్టున కొత్త మఠం నిర్మిస్తానని కూడా తెలియజేశారు. ఆ మఠంలో సమాజం పిల్లలకు ఉచితంగా విద్యా బోధన కూడా అందిస్తానన్నారు. వీటిని ట్రస్ట్ స్వాగతిస్తుందన్నారు.
బీజేపీ కార్యక్రమాల్లో స్వామీజీ ప్రత్యక్షం
స్వామీజీ బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో అధికారికంగా బీజేపీలోకి చేరినట్లయింది. ఆయన ప్రచార ప్రియులు, ఎల్లప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్, మీడియా అంటూ ప్రవర్తిస్తారు. స్వామీజీకి సమాజంపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇటీవల స్వామీజీ మఠానికి రావడం అరుదై పోయింది. దీంతో అక్రమ కార్యకలాపాలు మఠంలో చోటు చేసుకుంటున్నాయి. మఠం రక్షణ కోసం ఇటీవల గేట్, సీసీ టీవీ ఏర్పాటు చేశాం. స్వామీజీ స్వయాన వచ్చి సదరు తాళం చెవి అడిగితే అక్కడ ఉన్న వారే ఇచ్చేవారు. అయితే ఆయన సూచన మేరకు 7 మంది హఠాత్తుగా వచ్చి తాళాన్ని పగలకొట్టారు. అంతేగాక మరుసటి రోజు స్వామీజీ బసవ మంటపానికి వచ్చి ఊరుకనే మఠానికి రాకూడదని తనను అడ్డుకున్నారని ఆరోపించారు. స్వామీజీని ఎటువంటి పరిస్థితిలోను అడ్డుకొనే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం నుంచి సమాజ పిల్లలకు 2డీ ధృవీకరణ పత్రం ఇప్పించాలని విజయానంద కాశప్పనవర్ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర