
ముస్లింలకు మేయర్ పట్టం కట్టబెట్టాలి
బళ్లారిటౌన్: కాంగ్రెస్ పార్టీకి ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే మహానగర పాలికెలో మేయర్ స్థానాన్ని ముస్లింలకు కట్టబెట్టాలని పాలికె విపక్ష బీజేపీ నేత సీ.ఇబ్రహిం బాబు డిమాండ్ చేశారు. శనివారం నగరంలో ఓ ప్రైవేట్ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కురుబలు, ముస్లింలకు వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు. బీజేపీ గతంలో ముస్లింలకు మేయర్, ఉపమేయర్ ఛాన్స్ ఇచ్చిందన్నారు. ఇటీవల మేయర్ కుర్చీ కోసం కాంగ్రెస్ట్‌లో గందరగోళం నెలకొందన్నారు. కాంగ్రెస్‌కు ముస్లింలు ఓటు వేస్తున్నా మేయర్ స్థానం వారికి కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.
ఉత్సవ విగ్రహంలా మేయర్
ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్ నందీష్ కేవలం ఒక ఉత్సవ విగ్రహంలా ఉన్నారే తప్ప ఆయనకు అధికారం చలాయించేందుకు ఎలాంటి స్వేచ్ఛ లేదన్నారు. పాలికెలో 21 మంది కార్పొరేటర్లతో పాటు 5 మంది స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కలిగిన ఆ పార్టీలో గత నాలుగేళ్లుగా మేయర్ ఎన్నికల్లో మాత్రం గందరగోళం నెలకొంటూ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీంతో నగరంలో కనీసం రోడ్లలో గోతులను మూసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదన్నారు. సిద్ధార్థ్ నగర్, సదాశివ నగర్‌లలో ఓవర్ ట్యాంక్ నిర్మాణ పనులు జరిగి రెండేళ్లు అవుతున్నా వాటిలోకి నీరు నింపడం లేదన్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారన్నారు. నగరంలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కార్పొరేటర్లు శ్రీనివాస్ మోత్కూర్, కేఎస్.అశోక్‌కుమార్, గోవిందరాజులు, హనుమంతప్ప, రేణుక తదితరులు పాల్గొన్నారు.