
మారణహోమంపై సమగ్ర విచారణకు డిమాండ్
బళ్లారిటౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల సమీపంలోని అడవుల్లో వందలాది మహిళల మృతదేహాలను పూడ్చిన సాక్షిదారుడికి తగిన భద్రత కల్పించడంతో పాటు సమగ్ర దర్యాప్తు జరిపించాలని కర్ణాటక సమతా సైనిక దళ జోనల్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. శనివారం మహిళలతో కలిసి జిల్లాధికారికి ఆయన వినతిపత్రాన్ని సమర్పించి మాట్లాడారు. దేవస్థానంలో దళిత పారిశుధ్య కార్మికులను ఆలయంలోని పలుకుబడి కలిగిన సిబ్బంది ప్రాణ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. దాదాపు 20 ఏళ్లుగా మహిళల మృతదేహాలను అడవుల్లో అక్రమంగా రవాణా చేసి పాతిపెట్టారని స్వయంగా ఆయనే సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చారన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో, కోర్టులో ఫిర్యాదు సమర్పించినందున ఆయనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పదాధికారులు విశ్వనాథ్, మురళీ, ఖలీల్, లక్ష్మీదేవి, రోహిణి, శాంత, కమల, పద్మ, ద్రాక్షాయిణి తదితరులు పాల్గొన్నారు.