బీరు వద్దు.. మద్యం ముద్దు | - | Sakshi
Sakshi News home page

బీరు వద్దు.. మద్యం ముద్దు

Apr 12 2025 2:22 AM | Updated on Apr 12 2025 2:22 AM

బీరు

బీరు వద్దు.. మద్యం ముద్దు

సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో ప్రస్తుతం కరెంట్‌, నీరు, రవాణా చార్జీల ధరలు మోతమోగిపోతున్నాయి. ధరల పెంపుపై ప్రజలు ఆగ్రహంతో మండిపోతున్నారు. ఇదే సమయంలో మందుబాబులు కూడా సర్కార్‌పై మండిపడుతున్నారు. ఎందుకంటే మందు ధరలు ముఖ్యంగా బీర్‌ ధరను ప్రభుత్వం పెంచడమే కారణం. మండు వేసవిలో చల్లచల్లగా బీరు తాగుదామా అని ఆశపడ్డ మందు బాబులకు ఈ ధర పెంపు చుక్కెదురైంది. దీంతో బీర్ల కొనుగోలుపై మద్యం ప్రియులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా బీర్ల విక్రయాలు తగ్గిపోయాయి.

రూ.10 నుంచి 50 వరకు పెంపు

బీర్ల కంటే మద్యం బెటర్‌ అంటూ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈసారి ఆల్కహాలు మద్యంతో పోలిస్తే బీర్ల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ధరల పెంపు నిర్ణయం బీర్ల విక్రయాలపై పెద్ద ప్రభావం చూపించింది. ఈ ఏడాది జనవరి నుంచే బీర్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి 20 నుంచి బీర్లపై అదనపు అబ్కారీ పన్నును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సహజంగానే బీర్ల ధరలు పెరిగాయి. సాధారణ బ్రాండ్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్ని రకాల బీర్ల ధరలు పెరిగాయి. ప్రతి బీర్‌ బాటిల్‌పై ధర కనిష్టంగా రూ.10 నుంచి రూ.50 మేర పెరిగింది. అందులోనూ ఆల్కహాలు ప్రమాణం ఎక్కువగా ఉండే బీర్ల ధరలు అయితే ఇంకాస్త పెరిగాయి. గత ఆర్థిక ఏడాది తొలి 9 నెలల్లో అబ్కారీ శాఖ నుంచి ఆశించిన మేర ఆదాయం రాలేని కారణంగా బడ్జెట్‌ కంటే ముందుగానే బీర్ల ధరలను సర్కార్‌ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలా పదేపదే ధరలు పెంచుతూ తమ జేబులు గుల్ల చేస్తోందని మండిపడుతున్నారు.

గత ఏడాది 1,024 లక్షల లీటర్ల బీరు విక్రయం

రాష్ట్రంలో గతేడాది జనవరి 1 నుంచి ఏప్రిల్‌ 7 వరకు 1,024 లక్షల లీటర్ల (131.41 లక్షల బాక్సులు) బీర్ల విక్రయం జరిగింది. ఈ ఏడాది ఇదే సమయానికి కేవలం 836 లక్షల లీటర్లు (107.23 లక్షల బాక్సులు) బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 188 లక్షల లీటర్ల బీర్లు విక్రయం తక్కువగా జరిగింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, చిల్లర దుకాణాల నుంచి కూడా రాష్ట్ర బివరేజెస్‌ కార్పొరేషన్‌కు బీర్ల కొనుగోలుకు డిమాండ్‌ బాగా తగ్గిపోయింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొనుగోలు సమర్థ్యం కూడా బాగా తగ్గిపోవడంతో బీర్ల కొనుగోలు తగ్గిపోయింది.

మద్యం విక్రయాలు ఇలా..

ఒకవైపు బీర్ల వైపు నిరాసక్తి ఏర్పడితే మరోవైపు ఆల్కహాలు మద్యంపై మందుబాబుల చూపు పడింది. బీర్లకు ప్రత్యామ్నాయంగా మద్యం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్నారు. పెరిగిన బీర్ల కంటే మద్యం తాగడమే ఉత్తమమని అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జనవరి 1 నుంచి ఏప్రిల్‌ 7 వరకు 1,580 లక్షల లీటర్ల మద్యం అమ్ముడవగా ఈ ఏడాది అదే కాలానికి ఏకంగా 1,660 లక్షల లీటర్ల మద్యం అమ్ముడయింది. ఈ ఏడాది సుమారు 80 లక్షల లీటర్ల అదనపు మద్యం అమ్ముడవడం విశేషం.

బీరు వద్దు.. మద్యం ముద్దు1
1/1

బీరు వద్దు.. మద్యం ముద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement