ఆదర్శప్రాయుడు బాబూ జగ్జీవన్ రామ్
బళ్లారిటౌన్: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని, బాబూజీ వ్యక్తిత్వం, జీవిత చరిత్రను తెలుసుకుని యువత వారి ఆదర్శాలు, గుణగణాలను అలవరుచుకోవాలని జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పాలికె మేయర్ ముల్లంగి నందీష్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 5న ఈ జయంతిని జరుపుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడి రాజకీయ నేతగా ఎదిగారని గుర్తు చేశారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమైరా, నేతలు చిదానందప్ప, టి.పంపాపతి, అధికారులు మల్లికార్జున, బీ.నాగరాజు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల మైదానం నుంచి వివిధ శాఖల స్తబ్ద చిత్రాలతో ప్రారంభించిన భారీ ఊరేగింపు వివిధ రహదారుల గుండా సాగి దొడ్డనగౌడ రంగమందిరానికి చేరుకుంది.
సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన నేత
బళ్లారి రూరల్ : సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని బళ్లారి కాంగ్రెస్ ప్రముఖుడు వెంకటేశ్ హెగ్డె తెలిపారు. శనివారం భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ప్రతిమకు పూలమాలలు వేసి మాట్లాడారు. భారత చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం దాదాపు 30 ఏళ్లు మంత్రిగా పని చేసిన ఘనత బాబూజీకే దక్కిందన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో అత్యంత చిన్న వయస్సులో మంత్రి పదవి పొందిన వ్యక్తి బాబూజీ అని గుర్తు చేశారు. ఉప ప్రధానిగా కీర్తి ప్రతిష్టలు పొందిన మహనీయుడు జగ్జీవన్ రామ్. అప్పటి ఆహార సమస్యను సవాలుగా తీసుకొని పరిష్కార దిశగా మార్గాలను అన్వేషించిన వ్యక్తిగా బాబూజీకి పేరుందని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబ్కేర్, బాబూ జగ్జీవన్ రామ్ ఈ దేశానికి పెద్ద ఆస్తి అని నేటి యువత తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రముఖులు ఎం.ఎరుకులస్వామి, మల్లికార్జున, బళ్లారి సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు టి.ఆనంద్, ప్రముఖులు రాజ, తిప్పేస్వామి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
హరిత విప్లవ సృష్టికర్త జగ్జీవన్ రామ్
బళ్లారి రూరల్ : ఆహార శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకుడిగా బాబూ జగ్జీవన్ రామ్ పేరొందారని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ తెలిపారు. శనివారం దావణగెరెలో రాధమ్మ చెన్నగిరి రంగప్ప స్మారక రంగమందిరంలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంటనరానితనాన్ని రూపుమాపడానికి సమానత్వ సమాజం కోసం శ్రమించిన వ్యక్తిగా బాబూజీ కృషి చేశారన్నారు. 8 సార్లు లోక్‌సభ స్థానానికి ఎన్నికై ఎక్కువ కాలం మంత్రిగా పని చేశారన్నారు. ముఖ్యంగా అప్పట్లో దేశంలోని ఆహార కొరత సమస్యకు తనదైన శైలిలో పరిష్కారం చూపారన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా విశిష్ట సేవలను అందించారన్నారు. జిల్లాధికారి రాజ్యాంగ సందేశాన్ని చదివి ప్రమాణం చేశారు. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ప్రొఫెసర్ రామచంద్రయ్య జగ్జీవన్ రామ్ గురించి మాట్లాడారు. కార్యక్రమంలో దుడా అధ్యక్షుడు దినేశ్ కె.శెట్టి, జెడ్పీ సీఈఓ సురేశ్ బి.హిట్నాళ్, ఏఎస్పీ విజయకుమార్ బి.సంతోష్, దుడా కమిషనర్ హులమని తమ్మణ్ణ, దళిత ప్రముఖులు మల్లేశ్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.
బాబూజీ ఆదర్శాలను అలవర్చుకోవాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో బాబూజీ ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖా మంత్రి బోసురాజు అన్నారు. శనివారం బాబూ జగ్జీవన్ రామ్ సర్కిల్ వద్ద జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూల మాలలు వేసి మాట్లాడారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఎమ్మెల్సీ వసంత్ కుమార్ ప్రసంగిస్తూ భారత దేశంలో దళిత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మహా నేత బాబూజీ అన్నారు. కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యత కల్పించడంతో పాటు దేశంలో అహార పదార్థాల కొరత ఏర్పడినప్పుడు హరిత విప్లవాన్ని సృష్టించిన మహాన్ మేధావి అన్నారు. స్టేషన్ సర్కిల్‌లో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లాఽధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, సీఈఓ రాహుల్ తుకారాం పాండే, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో పూలమాలలు వేశారు.
ఆదర్శప్రాయుడు బాబూ జగ్జీవన్ రామ్
ఆదర్శప్రాయుడు బాబూ జగ్జీవన్ రామ్
ఆదర్శప్రాయుడు బాబూ జగ్జీవన్ రామ్


