సర్కారు ధరాఘాతం.. సామాన్యుల బతుకు భారం
శివాజీనగర: రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను పెంచి పేద, సామాన్య ప్రజలు జీవించకుండా చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ధ్వజమెత్తింది. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు బుధవారం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో అహోరాత్రి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పాలు, విద్యుత్, బస్సు, మెట్రో చార్జీలను పెంచారు, ఇంధన సెస్సును పెంచారు. స్టాంప్ ఫీజును పెంచారు. ఇది ధరలను పెంచే ప్రభుత్వమని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్, మాజీ సీఎం యడియూరప్ప సహా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. తమ పోరాటం ఆగదని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు బీజేపీ విశ్రమించదని చెప్పారు. దరల పెరుగుదలతో ప్రజల బతుకు భారంగా మారిందని చెప్పారు. పెంచిన ధరలను తగ్గించేవరకు రాష్ట్రమంతటా ధర్నాలు చేస్తామని యడియూరప్ప తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి పనులను నిలిపివేసింది, అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య వేషధారితో వ్యంగ్య నాటకాన్ని ప్రదర్శించారు. మరోవైపు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై విధానసభ స్పీకర్ ఖాదర్ విధించిన 6 నెలల ససెన్షన్‌ను రద్దు చేయాలని విధానసౌధ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు.
ధర్నాకు పిలవలేదని జేడీఎస్ అసంతృప్తి
బీజేపీ ఆందోళనలకు మిత్ర పక్షమైన జేడీఎస్‌ను ఆహ్వానించలేదని ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు సీ.బీ.సురేశ్‌బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగళూరులో మాట్లాడిన ఆయన, జేడీఎస్‌ను బీజేపీ ధర్నాకు పిలవకపోవడం సరికాదు. మునుముందు సమస్యలకు కారణమవుతుందన్నారు. గతంలో ముడా పాదయాత్ర సందర్భంలో కూడా తమకు పిలుపు లేదని వాపోయారు. శాసనసభాలో తాము ఐకమత్యంగా పోరాటం చేశామని ఆయన తెలిపారు.
మహిళా కాంగ్రెస్ ఆందోళన
బీజేపీ నిరసనలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు మహిళా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో బీజేపీ ధర్నా
పాల్గొన్న ముఖ్య నేతలు
సర్కారు ధరాఘాతం.. సామాన్యుల బతుకు భారం
సర్కారు ధరాఘాతం.. సామాన్యుల బతుకు భారం


