Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది? | - | Sakshi
Sakshi News home page

Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?

May 5 2024 7:30 AM | Updated on May 5 2024 9:09 AM

ఏ గది

ఏ గదిలో ఏం జరిగింది?

రేవణ్ణ ఇంట్లో ముమ్మర తనిఖీలు

బాధితురాలిని తీసుకెళ్లి సిట్‌ సోదాలు

విదేశాల్లోనే ఎంపీ ప్రజ్వల్‌ మకాం

శివాజీనగర/ యశవంతపుర: ఇంట్లో పని మనిషులపై లైంగిక దాడులు, అశ్లీల వీడియోల కేసులో నిందితుడైన ఎంపీ ప్రజ్వల్‌ మే 10లోగా సిట్‌ ముందు విచారణకు హాజరు కానున్నారని తెలిసింది. గత నెల 27 నుంచి విదేశాలలో మకాం వేసిన ఆయన విచారణకు రావాలని సిట్‌ రెండుసార్లు నోటీస్‌లు ఇచ్చింది. ఫలితం లేకపోవడంతో లుకౌట్‌ నోటీస్‌ను జారీ చేసింది. వీటి గురించి విదేశాల్లో ఉంటూనే బెంగళూరులోని తన న్యాయవాదులతో ఆయన చర్చల్లో ఉన్నట్లు తెలిసింది. అయితే హాజరు కావడానికి ముందే, దేశంలో ఏ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను సిట్‌ అరెస్ట్‌ చేయవచ్చని తెలుస్తోంది.

 హాసన్‌ ఆర్‌సీ రోడ్డులోని ఎంపీ ప్రజ్వల్‌ ఆఫీసులో తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం సిట్‌ అధికారులు ఆఫీసు తాళాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక బాధిత మహిళను శనివారం హోళెనరసిపురలోని మాజీ మంత్రి రేవణ్ణ ఇంటికి తీసుకెళ్లి స్థల పరిశీలన చేశారు. ఆ ఇంట్లోనే వంట, బెడ్‌ రూం, స్టోర్‌ రూంను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏయే గదిలో ఏం జరిగింది?, ఎక్కడెక్కడ లైంగిక దాడికి పాల్పడిందీ బాధితురాలిని అడిగి నమోదు చేశారు. ఈ సోదాలను వీడియో రికార్డ్‌ చేశారు. ఈ సమయంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటైంది.

రేవణ్ణ భార్యకు నోటీసులు
సిట్‌ విచారణకు రేవణ్ణ హాజరు కావడం లేదు. ఆయన భార్య భవానీకి నోటీసులు పంపగా, ఆమె సైతం విచారణకు రాలేదు. పెన్‌డ్రైవ్‌ను బహిరంగపరచిన స్థానిక బీజేపీ నాయకుడు దేవరాజేగౌడ శుక్రవారం సిట్‌ ముందు హాజరై వాంగ్మూలమిచ్చారు. సిట్‌ అధికారులు ఆయనను అనేక విధాలుగా ప్రశ్నించారు. తండ్రి రేవణ్ణ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సతీశ్‌ బాబణ్ణ అనే వ్యక్తిని సిట్‌ ఈ కేసులో అరెస్టు చేసింది. రేవణ్ణ, ప్రజ్వల్‌కు సంబంధించిన 40 చోట్ల సిట్‌ పోలీసులు సోదాలు నిర్వహించి సమాచారాన్ని సేకరించారు. సిట్‌ చీఫ్‌ బీకే సింగ్‌ కేసును పర్యవేక్షిస్తున్నారు.

మానసిక ఒత్తిడిలో దేవెగౌడ
జేడీఎస్‌ అధినేత, రేవణ్ణ తండ్రి దేవెగౌడ ఈ వ్యవహారాలతో మానసిక ఒత్తిడితో ఉన్నట్లు తెలిసింది. ఆయనకు ఈ విషయాలను చెప్పరాదని, టీవీ చూడకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహానిచ్చారు.

సీఎం సమీక్ష
ఎంపీ ప్రజ్వల్‌ కేసులో పురోగతిపై సీఎం సిద్దరామయ్య సిట్‌ అధికారులతో సమావేశమయ్యారు. నిందితున్ని త్వరగా అరెస్టు చేయాలి, కేసుతో ప్రమేయమున్నవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇందులో అలసత్వాన్ని సహించేది లేదు అని అధికారులకు సీఎం చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ఆప్‌ సహా పలు మహిళా సంఘాలు బెంగళూరు తదితర ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించాయి.

 

ఏ గదిలో ఏం జరిగింది?1
1/3

ఏ గదిలో ఏం జరిగింది?

ఏ గదిలో ఏం జరిగింది?2
2/3

ఏ గదిలో ఏం జరిగింది?

ఏ గదిలో ఏం జరిగింది?3
3/3

ఏ గదిలో ఏం జరిగింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement