చాక్లెట్లలో గంజాయి.. ఎయిర్‌పోర్టులో సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

చాక్లెట్లలో గంజాయి.. ఎయిర్‌పోర్టులో సీజ్‌

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

చాక్లెట్లలో గంజాయి..  ఎయిర్‌పోర్టులో సీజ్‌

చాక్లెట్లలో గంజాయి.. ఎయిర్‌పోర్టులో సీజ్‌

దొడ్డబళ్లాపురం: క్యాండీలు, చాక్లెట్ల రూపంలో గంజాయి, డ్రగ్స్‌ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుని లగేజీలో 9.7 కేజీల హైడ్రోఫోనిక్‌ గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.3.39 కోట్లుగా తెలిసింది. క్యాండీలు, చాక్లెట్ల రూపంలో గంజాయిని తరలిస్తున్నారు. మరో ప్రయాణికుడు 1.7 కేజీల చరస్‌, హషిష్‌ తరలిస్తూ పట్టుబడ్డాడు. విలువ రూ.4.7 కోట్లుగా అధికారులు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేశారు.

కారు దూసుకెళ్లి చిన్నారి మృతి

దొడ్డబళ్లాపురం: ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని కారు ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి అక్కడే చనిపోయిన సంఘటన బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా వాటరె గ్రామంలో జరిగింది. త్రిష (17 నెలలు) అనే పాప ఇంటి ముందు ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. చక్రాల కింద నలిగిన బాలిక క్షణాల్లోనే మృత్యువాత పడింది. కారు డ్రైవరుపై ఖానాపుర పోలీసులు కేసు నమోదు చేశారు.

భూ స్కాం కేసులో

సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్టు

దొడ్డబళ్లాపురం: కోట్ల రూపాయల విలువ చేసే భూమికి నకిలీ పత్రాలు తయారుచేసి విక్రయించిన కేసులో బెళగావి జిల్లా హుక్కేరి పోలీసులు సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు 9 మందిని అరెస్టు చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ మడివాళయ్య, పత్రాలను తయారుచేసిన అశోక్‌, రైటర్‌ ఆనంద నిందితుల్లో ఉన్నారు. కురణి గ్రామంలోని 2.1 ఎకరాల భూమి యజమాని శివానంద. ఆయనకు తెలియకుండా నిందితులు ఫోటోషాప్‌ ద్వారా ఆధార్‌ కార్డ్‌, ఇతర పత్రాలను రూపొందించి, తమదేనంటూ ఒక బిల్డర్‌కి విక్రయించారు. ఇందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కూడా సహకరించాడు. ఇది తెలుసుకున్న భూ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

రైలులో మొబైల్‌ చోరీ

శివమొగ్గ: మంగళవారం రాత్రి శివమొగ్గలోని విద్యానగర రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక దుండగుడు రైలు బోగీలోకి ప్రవేశించి, ప్రయాణికులను బెదిరించి, మొబైల్‌ ఫోన్‌ లాక్కొని పారిపోయాడు. ఈ సంఘటన యశ్వంతపుర– తలగుప్ప రైలులో జరిగింది. రైలు శివమొగ్గలోని విద్యానగర రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు ఓ దొంగ బోగీలోకి ప్రవేశించాడు. కత్తితో భయపెట్టి ఒక ప్రయాణికుని మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. బాధితుడు రైల్వే శాఖ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు.

రాహుల్‌పై పోస్టు.. అరెస్టు

శివమొగ్గ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గురించి అవమానకరమైన పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అభియోగంపై తీర్థహళ్లి బీజేపీ ఎమ్మెల్యే అరగ జ్ఞానేంద్ర సన్నిహితుడు రాజేష్‌ హిరిమానైపె కేసు నమోదైంది. రాహుల్‌గాంధీని పాకిస్తాన్‌ సైనికాధికారి ముఖంతో కలిపిన ఫోటోని రాజేష్‌ పోస్ట్‌ చేశాడు. వీరిద్దరిదీ ఒకే అజెండా అనే వ్యాఖ్య కూడా చేశాడు. దీంతో స్థానిక పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరచగా ఈ నెల 24 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement