అగ్రనేతల ముందుకు సీటు పాట్లు | - | Sakshi
Sakshi News home page

అగ్రనేతల ముందుకు సీటు పాట్లు

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

అగ్రన

అగ్రనేతల ముందుకు సీటు పాట్లు

శివాజీనగర/ బనశంకరి: రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న ముఖ్యమంత్రి పదవి మార్పిడి వివాదంలో ఇదో మైలురాయి. ఎట్టకేలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ గురువారం ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. సీటు గొడవలో అనేకసార్లు భేటీకి డీకే యత్నించినా అపాయింట్‌మెంట్‌ లభించలేదు. ఇటీవల మైసూరులో ఎయిర్‌పోర్టులోనే రాహుల్‌ కొంతసేపు చర్చించారు. రెండురోజుల కిందట ఢిల్లీకి వచ్చిన డీకే శివకుమార్‌ ఈదఫా రాహుల్‌గాంధీతో సమావేశమై సీఎం పీఠం మార్పిడి అంశం, రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సోనియాగాంధీ నివాసంలో ప్రియాంకగాంధీ, తరువాత సోనియాగాంధీని కూడా కలిశారు. వారిముందే రాహుల్‌గాంధీతో చర్చలు జరిపారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, తమ శ్రమకు ప్రతిఫలం ఇవ్వాలని విన్నవించారని తెలిసింది. అధికార పంపిణీ ఒప్పందాన్ని గుర్తుచేశారు. దీనికి స్పందించిన రాహుల్‌, ప్రియాంకగాంధీ.. త్వరగా తీర్మానం చేస్తాం, కొంతవరకు సహనంతో ఉండాలని చెప్పారని తెలిసింది. తక్షణం ఓ నిర్ణయానికి రాలేం, సీఎం సిద్దరామయ్యను ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతాం. ఆ తరువాత ఒక నిర్ణయానికి వస్తామని హామీ ఇచ్చినట్లు డీకే సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

రాజకీయం చేయడానికే వచ్చా: డీకే

నేను రాజకీయాల్లో ఉన్నా, రాజకీయం చేయాలి, హైకమాండ్‌కు అన్నీ వివరించాను అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. గురువారం ఢిల్లీలో కర్ణాటక భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పదవిపై హైకమాండ్‌ నుంచి స్పష్టత లభించిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, నేను దీని గురించి చర్చించలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ నేత రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. సహనం కూడా ప్రతిఫలం ఇస్తుందన్నారు. నేను ఢిల్లీకి వస్తే రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్‌, సుర్జేవాలా ఇలా అందరినీ కలుస్తానని తెలిపారు. రాజకీయాలు చర్చించకుండా ఉంటామా?, కానీ వాటిని మీడియా ముందు వెల్లడించడం సబబు కాదన్నారు. సీఎం తనయుడు యతీంద్ర మా హైకమాండ్‌ కదా, ఆయన మాటలను స్వీకరించాలని చమత్కరించారు. ఎమ్మెల్యేల విదేశీ పర్యటన గురించి నేను ఏమీ మాట్లాడను, వారికి సీఎం ఏ మార్గదర్శకం చేస్తున్నారో తెలియదన్నారు. టూర్‌ గురించి తనతో చర్చించలేదన్నారు. తమ మధ్య సంఘర్షణ లేదని, తాను, సీఎం పార్టీ తీర్మానానికి కట్టుబడి నడుచుకుంటున్నామని చెప్పారు. తమ సర్కారుకు 1000 రోజులు పూర్తి కావడం సంతోషంగా ఉంది, ఈ సందర్భంగా భూమి గ్యారంటీ పథకాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామన్నారు. భూమి హక్కుపత్రం లేని వారికి హక్కుపత్రాలు, పట్టా పుస్తకాలను అందిస్తామని తెలిపారు.

సోనియాగాంధీ, ప్రియాంక,

రాహుల్‌తో డీసీఎం శివ భేటీ

సీఎం పదవి కోసం విజ్ఞప్తి

సహనంతో ఉండాలని హైకమాండ్‌ హితబోధ

సీఎం సిద్దును పిలిచి చర్చించి, ఆపై నిర్ణయానికి భరోసా

అగ్రనేతల ముందుకు సీటు పాట్లు 1
1/2

అగ్రనేతల ముందుకు సీటు పాట్లు

అగ్రనేతల ముందుకు సీటు పాట్లు 2
2/2

అగ్రనేతల ముందుకు సీటు పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement