
పురస్కారాలు అందజేసిన దృశ్యం
బనశంకరి: తల్లిదండ్రులతో సమానంగా కన్నడ భాషకు గౌరవం ఇవ్వాలని నటుడు రమేశ్ అరవింద్ సూచించారు. శనివారం రాత్రి బీబీఎంపీ కేంద్ర కార్యాలయ ఆవరణలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఉద్యోగుల కన్నడ సంఘం ఆధ్వర్యంలో కన్నడ రాజ్యోత్సవం, కర్ణాటక రత్న డాక్టర్ పునీత్‌రాజ్‌కుమార్ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. నటుడు రమేశ్ అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తమ రోడ్లు, ఉద్యానవనాలు, స్వచ్ఛతకు బీబీఎంపీ కారణమన్నారు. పంపకవి, బసవణ్ణ, అనేక మంది సాహితీకారులు కన్నడభాష అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. అనంతరం నటుడు సుందరరాజ్ మాట్లాడుతూ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న పౌరకార్మికుల ఆరోగ్యాలను పరిరక్షించాలన్నారు. బీబీఎంపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏ.అమృతరాజ్ మాట్లాడుతూ ఈ నెల 25 తేదీన నేపాల్ పశుపతినాథ ఆలయంలో అంతర్జాతీయ కర్ణాటక రాజ్యోత్సవం నిర్వహిస్తామన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సాధన చేసినవారికి డాక్టర్ పునీత్‌రాజ్‌కుమార్ పేరుతో పురస్కారాలు అందజేశారు.
అవార్డులు అందుకున్నవారు వీరే
కర్ణాటక వికాసవేదిక అధ్యక్షుడు పాలనేత్ర, కన్నడచళువళి కేంద్ర సమితి అధ్యక్షుడు గురుదత్త , నటి ప్రమీళ జోషాయ్ తరఫున సుందరరాజ్, శివకుమార్, రిషిగౌడ, ప్రేమగౌడ, రక్షాఅపూర్వ, ప్రతిభ, మాలతేశ్, వసంత్‌కుమార్, స్మితారంగనాథ్, శీతల్‌శెట్టి, మంజునాథ్, అల్లావుద్దీన్, పురుషోత్తమ్, కొండయ్య , పుట్టరాజు, డొళ్లుకుణిత కళాకారుడు చంద్రు, యోగా క్రీడాసంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, మరో 20 మంది బీబీఎంపీ అధికారులకు అవార్డులు అందించారు. కార్యక్రమంలో పాలికె పాలనాధికారి రాకేశ్‌సింగ్, కమిషనర్ తుషార్‌గిరినాథ్ మాజీ మేయర్ హుచ్చప్ప, ప్రత్యేక కమిషనర్లు కేవీ.త్రిలోక్‌చంద్ర, మౌనిశ్‌ముద్గిల్, కే.హరీశ్, ప్రహ్లాద్ పాల్గొన్నారు.
నటుడు రమేశ్ అరవింద్
ఘనంగా కన్నడ రాజ్యోత్సవం
పలువురికి కర్ణాటక రత్న డాక్టర్ పునీత్‌రాజ్‌కుమార్ పురస్కారాల ప్రదానం