శాంతించిన ఆర్టీసీ ఉద్యోగులు
బనశంకరి: అందరినీ కంగారు పెట్టిన ఆర్టీసీ సమ్మె కొన్ని గంటల్లోనే ముగిసిపోయింది. వేతనాల పెంపు సహా వివిధ డిమాండ్లను తీర్చాలని బెంగళూరు చలో ధర్నాకు పిలుపునిచ్చిన కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ, కొన్ని నెలల బకాయిలు చెల్లించడానికి మార్చి 2 వరకు గడువు కోరింది. గురువారం ఫ్రీడం పార్కులో రవాణాశాఖ సంఘాల క్రియాసమితి సభ్యులు, నేతలు చర్చించి సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి మామూలుగానే బస్సులు నడుస్తాయని తెలిపారు. జీతాలను పెంచడంతో పాటు 38 నెలల వేతన బకాయిలు చెల్లించాలన్నారు. గడువు లోగా తీర్చని పక్షంలో మార్చి 2 నుంచి ఉపవాస సత్యాగ్రహం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు డిమాండ్లు తీర్చేవరకూ సమ్మె కొనసాగాలని కొందరు ఉద్యోగులు పట్టుబట్టారు.
జిల్లాల నుంచి రాక
శివాజీనగర: అంతకుముందు ఆర్టీసీ, బీఎంటీసీ సిబ్బందితో పాటుగా వివిధ జిల్లాల నుంచి వందలాది ఉద్యోగులు ఫ్రీడం పార్కుకు తరలివచ్చారు. బస్సులు మాత్రం సాధారణంగానే నడిచాయి. సమ్మెలో పాల్గొన్న సిబ్బందికి హుబ్లీలోని వాయువ్య కర్ణాటకరోడ్డు రవాణాసంస్థ ఎండీ ప్రియాంక జీతం ఉండదని హెచ్చరించారు. ఆందోళన ప్రభావం ఏమీ లేదని చెప్పారు.
సమ్మె లేదు.. ధర్నానే
మార్చి 2 వరకు గడువు కోరిన సర్కారు


