అధికారమే లక్ష్యంగా శ్రమిద్దాం
శివాజీనగర: రాష్ట్రంలో అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించే సంకల్పం చేయాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. గురువారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశం అట్టహాసంగా జరిగింది. మాజీ సీఎం యడియూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా షెకావత్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటాలకు, ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు సంకల్పం చేయాలన్నారు. ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందన్నారు. బీజేపీని బలోపేతం చేసి మళ్లీ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని దృఢ సంకల్పంతో కృషి చేయాలని అన్నారు. కర్ణాటక బీజేపీలో భీష్మ పితామహుడని యడియూరప్పను ఆయన అభినందించారు.
శాంతి భద్రతలు మృగ్యం
విజయేంద్ర మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ గత వైభవం తీసుకొచ్చేందుకు రాత్రి పగలు శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హిందూ కార్యకర్తలు, దళితుల హత్యలు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారాయని దుయ్యబట్టారు. రాష్ట్ర సహ ఇన్‌చార్జి పీ.సుధాకర్‌రెడ్డి, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, వీ సోమణ్ణ, శోభా కరంద్లాజె, మాజీ సీఎంలు సదానందగౌడ, జగదీశ్ శెట్టర్, బీ.శ్రీరాములు, గాలి జనార్ధనరెడ్డి, గాలి కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అగ్ర నేతల పిలుపు
బెంగళూరులో కార్యవర్గ సమావేశం
అధికారమే లక్ష్యంగా శ్రమిద్దాం


