కాంట్రాక్టర్లు వర్సెస్ కాంగ్రెస్ సర్కార్
ఏ శాఖ ఎంత పెండింగ్..
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య మళ్లీ రగడ మొదలైంది. పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఆందోళనబాట పట్టడం తప్పా వేరే మార్గం లేదని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని సిద్దరామయ్య సర్కార్ స్పష్టం చేస్తోంది. ఉన్నవన్నీ గత ప్రభుత్వ హయాంలోని బకాయిలని చెబుతోంది. మరోవైపు కాంట్రాక్టర్లు అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. డీసీఎం డీకే శివకుమార్, మంత్రి సతీశ్ జార్కిహొళి వీటిని తిరస్కరించారు. ఇలా ప్రభుత్వానికి– కాంట్రాక్టర్లకు మధ్య వివాదం తారాస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. ప్రభుత్వ రోడ్లు, భవనాల నిర్మాణాలు చేయడం, వస్తు సామగ్రి సరఫరా చేయడం కాంట్రాక్టర్ల పనులు. ఇందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయన్నది తెలిసిందే.
కాంట్రాక్టర్ల ఆరోపణలు ఏమిటి?
గతంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల సంఘం 40 శాతం కమీషన్లు ఇస్తున్నట్లు ఆరోపణలు చేసింది. ఇది అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు పెద్ద అస్త్రంగా మారింది. బీజేపీ పరాజయానికి ఇది కూడా కారణమన్నది తెలిసిందే. ఇప్పుడు నేటి కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కమీషన్ల గళమెత్తారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు పట్టుబడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మార్చి 5 తర్వాత ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల సంఘం ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.
కొండలా
బకాయిలు
రూ. 37 వేల కోట్ల పెండింగ్ బిల్లులు..
మంజూరుకు కమీషన్ల ఒత్తిడి ఆరోపణలు
గత ప్రభుత్వ బిల్లులని సర్కారు స్పష్టం
బిగుస్తున్న చిక్కుముడి
రెండున్నరేళ్లుగా కాంట్రాక్టర్లకు రూ. 37 వేల కోట్లు చెల్లించకుండా నాన్చుతున్నారని కాంట్రాక్టర్ల సంఘం ఆరోపిస్తోంది. ఇందులో ప్రజా పనుల శాఖ నుంచి రూ. 8 వేల కోట్లు, జలవనరుల శాఖ నుంచి రూ. 13 వేల కోట్లు, ఆర్‌డీపీఆర్ శాఖ నుంచి రూ. 3,800 కోట్లు, గృహనిర్మాణ శాఖ నుంచి రూ. 2800 కోట్లు, కా ర్మిక శాఖ నుంచి రూ. 2 వేల కోట్లు, బీబీఎంపీ నుంచి రూ. 1600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. బిల్లుల మంజూరుకు కమీషన్లు ఇవ్వాలనే ఒత్తిడి తరచూ ఉంటోందని సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆరోపించారు.
ముడుపులు అడిగితే చెప్పండి: డీసీఎం
కాంట్రాక్టర్ల ఆరోపణలపై డీసీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో కమీషన్లు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయమని వారిని కోరినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఊరికే ఉండి ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం సమంజసం కాదని తెలిపారు.
ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి మాట్లాడుతూ కమీషన్ల కోసం ఒత్తిడి చేస్తే వెంటనే సీఎం, లోకాయుక్తా దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. నిధుల కొరత ఉన్నప్పటికీ బీజేపీ హయాంలో అధికంగా పనులు అప్పగించారని, అందువల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పనులకు, టెండర్లకు తమ సర్కారు బిల్లులు చెల్లించినట్లు చెప్పారు.
కాంట్రాక్టర్లు వర్సెస్ కాంగ్రెస్ సర్కార్


