కరీంనగర్ జిల్లాకు నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు
హుజూరాబాద్ పాఠశాలకు రూ.9.97 కోట్ల నిధులు
నాలుగు ఎకరాల్లో 32 గదులు.. 1,200 మంది విద్యార్థులకు అవకాశం
ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఆధునిక విద్యాబోధన
సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలతో సరికొత్త రూపు
సర్కారు బడులు..
హుజూరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య, ఆధునిక సదుపాయాలు, క్రీడా వసతులు కల్పించే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేయనుంది. తొలి విడతలో కరీంనగర్ జిల్లాకు నాలుగు పాఠశాలలు మంజూరయ్యాయి. వీటిలో హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలను రూ.9.97 కోట్లతో ఆధునిక విద్యాసంస్థగా తీర్చిదిద్దనున్నారు. ఈ పాఠశాల అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ బడుల్లోనే అందనుంది.
రూ.9.97 కోట్లతో ఆధునికీకరణ..
హుజూరాబాద్ పట్టణంలోని క్రీడా మైదానం పక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అభివృద్ధి చేయనున్నారు. సుమారు నాలుగు ఎకరాల్లో 32 తరగతి గదులతో 1,200 మంది విద్యార్థులకు విద్యాబోధన అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రీప్రైమరీ నుంచి 11, 12 తరగతుల వరకు బోధన అందించనున్నారు. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, మ్యూజిక్, స్పోర్ట్స్ రూమ్‌లతో పాటు ఆధునిక క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. రవాణా సదుపాయం, సెమీ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహణపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం..
విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా బాక్స్ క్రికెట్, బాస్కెట్‌బాల్ కోర్టు, వాకింగ్ ట్రాక్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. హుజూరాబాద్‌లో మరో ప్రభుత్వ పాఠశాలకు, చెల్పూర్ పాఠశాలకు, వీణవంక మండలంలోని మోడల్ స్కూల్‌కు కూడా రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.
జిల్లాకు నాలుగు పాఠశాలలు..
కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గంలోని బంజేరుపల్లి, కరీంనగర్ నియోజకవర్గంలోని చింతకుంట, చిగురుమామిడి ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఆధునిక వసతులతో ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
నాణ్యమైన బోధన అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పిస్తే సామాన్య కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని విద్యార్థుల తల్లి శ్రీరాముల కళ్యాణి పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. భవనాలు, ల్యాబ్‌లు, క్రీడా వసతులతో పాటు నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్‌ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు ప్రశాంత్‌యాదవ్ సూచించారు.


