కోనరావుపేట(వేములవాడ): రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబానికి రోడ్డు ప్రమాదం తీరని కష్టాన్ని మిగిల్చింది. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ, అవసరమైనప్పుడు కూలీ పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న ఓ యువకుడు.. ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 15 రోజులుగా కోమాలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కంటికి రెప్పలా చూసుకునే భర్త తిరిగి కోలుకోవాలని భార్య.. తండ్రి మళ్లీ తమ మధ్యకు రావాలని పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు. దాతల సాయం కోసం దీనంగా వేడుకుంటున్నారు. వివరాలు.. కోనరావుపేట మండలంలోని జై సేవాలాల్ భూక్యారెడ్డి తండాకు చెందిన లకావత్ సుదర్శన్ అలియాస్ సిద్ధు కొన్నేళ్లుగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 12న ద్విచక్రవాహనంపై వేములవాడ వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ తరలింపు
దీంతో కుటుంబ సభ్యులు సిద్ధును హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఇందుకోసం తెలిసినవారి వద్ద అప్పులు చేసి, ఉన్నదంతా సమకూర్చారు. అయినా సిద్ధు ఆరోగ్యం మెరుగుపడాలంటే మరో రూ.15 లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. ఓవైపు ఆస్పత్రిలో భర్త ప్రాణాల కోసం పోరా టం.. మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి.. ఈ కష్టకాలంలో ఎవరిని ఆశ్రయించాలో తెలియక భా ర్య రజిత కన్నీరుమున్నీరవుతోంది. తండ్రి కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మానవత్వంతో స్పందించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి తమ కుటుంబానికి అండగా నిలవాలని రజిత వేడుకుంటోంది. సిద్ధు ప్రాణాలు నిలబెట్టేందుకు ఆపన్నహస్తం అందించాలని కోరుతోంది. సిద్ధు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలనుకునేవారు కుటుంబ సభ్యులు 83747 38392 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని వేడుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి
15 రోజులుగా కోమాలోనే..
ఇప్పటికే రూ.15 లక్షలు ఖర్చు..
మరో రూ.15 లక్షలు అవసరం
ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న భార్య, ఇద్దరు పిల్లలు


