ఆకాశమే హద్దు | - | Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దు

Nov 29 2026 1:59 PM | Updated on Nov 29 2026 1:59 PM

సిరిసిల్ల: కలలు కనడమే కాదు.. వాటిని నెరవేర్చుకునేందుకు పట్టుదల.. కృషితో ముందుకెళ్లారు. ఆకాశమంతా లక్ష్యాన్ని సంకల్పబలంతో సాధించారు. ఆసక్తి..ఆచరణ..కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో పదో తరగతి చదివే తొంటి రితీష, 9వ తరగతి చదివే ఆలూరి స్మిత. తెలంగాణ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జాతీయ ఏవియేషన్‌ ఒలింపియాడ్‌(ఎన్‌ఏవో) పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొనగా.. ఐదుగురు మాత్రమే జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఆ ఐదుగురిలో ఇద్దరు తంగళ్లపల్లి కేజీబీవీ బాలికలు కావడం విశేషం.

● పల్లె నుంచి ఢిల్లీ దాకా..

రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన రైతు తొంటి భూమయ్య, వాణి దంపతుల కూతురు రితీష కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన రైతు ఆలూరి ప్రవీణ్‌, శ్రీలేఖ దంపతుల కూతురు స్మిత తొమ్మిదో తరగతి చదువుతోంది. రైతు కుటుంబాల్లో జన్మించిన ఆ ఇద్దరు అమ్మాయిలు విమానాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రారంభమైన ప్రయాణం జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టాయి. రాష్ట్రస్థాయిలో మూడు దశల పోటీల్లో ప్రతిభ చాటుకున్న ఆ విద్యార్థినిలు జాతీయస్థాయి ఫైనల్‌కు అర్హత సాధించారు. డిసెంబరు 7న న్యూఢిల్లీ భారత్‌ మండపంలో జరిగే జాతీయస్థాయి ఏవియేషన్‌ సదస్సులో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు.

● ఉపాధ్యాయురాలి కల..

విద్యార్థినుల విజయం

విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో పోటీపడే అవకాశాలు కల్పించాలని బయోసైన్స్‌ సీఆర్‌టీ, ఎన్‌ఏవో గైడ్‌ టీచర్‌ ఎం.డి.నస్రీన్‌ ఆకాంక్షించారు. ఈక్రమంలోనే జాతీయ ఏవియేషన్‌ ఒలింపియాడ్‌ గురించి విద్యార్థినులకు పరిచయం చేసి, వారిలో ఆసక్తిని పెంచారు. పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. తన కలను సాకారం చేసుకునే దిశగా విద్యార్థినులను ఎంపిక చేసి, వారి కోసం ప్రత్యేకంగా అధ్యయన ప్రణాళిక రూపొందించి, నిరంతర మార్గదర్శకత్వం అందించారు. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో ఇద్దరు విద్యార్థినులు విజయం వైపు అడుగులు వేస్తున్నారు.

● బోధించిన అంశాలివీ..

విమానయాన చరిత్ర, విమానాల నిర్మాణం, ఇంజిన్లు, ఏరోడైనమిక్స్‌, విమానాశ్రయాల నిర్వహణ, విమాన భద్రత, నావిగేషన్‌ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అధ్యయన సామగ్రి, ప్రాక్టీస్‌ ప్రశ్నలు, పునశ్చరణ, మాక్‌ పరీక్షల ద్వారా వారిని ప్రతీ దశకు సిద్ధం చేశారు. విద్యార్థినులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ, ప్రతీ దశలో వెన్నంటి నిలిచారు. మూడు దశలను విజయవంతంగా అధిగమించి ఇద్దరు విద్యార్థినులు జాతీయ ఫైనల్‌కు ఎంపిక కావడంతో గైడ్‌ టీచర్‌ ఆశయం సాకారమైంది.

● బాలికల ఉత్సాహం.. అందరి ప్రోత్సాహం

బాలికల ఉత్సాహన్ని గుర్తించి పాఠశాల స్థాయిలో అందరి సహకారంతో ముందుకు నడిపించారు. జీసీడీవో పద్మజ, కేజీబీవీ తంగళ్లపల్లి ప్రత్యేక అధికారి ఎ.శ్యామల విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు, అధ్యయనానికి అనుకూలమైన వాతావరణం కల్పించారు. దీంతో విద్యార్థినుల జాతీయస్థాయి ప్రయాణానికి మరింత బలాన్నిచ్చాయి. అధికారుల సహకారం, పాఠశాల యాజమాన్య ప్రోత్సాహం, గైడ్‌ టీచర్‌ అంకితభావం కలిసివచ్చి ఈ విజయానికి మార్గం సుగమం చేశాయి.

● అభినందించిన కలెక్టర్‌

జాతీయ స్థాయి ఏవియేషన్‌ సదస్సుకు ఎంపికై న బాలికలను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కలెక్టరేట్‌లో ఇటీవల సన్మానించి, అభినందించారు. వారి విజ యం ఇతర విద్యార్థినులకు స్ఫూర్తిగా నిలుస్తోంద ని, ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికలలో కొత్త ఆశలు, ఆకాంక్షలు రేకెత్తిస్తోందన్నారు. న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఫైనల్‌లోనూ బాలికలు రాణించాలని ఆకాంక్షించారు.

నేషనల్‌ ఏవియేషన్‌ ఒలింపియాడ్‌

ఫైనల్‌కు తంగళ్లపల్లి విద్యార్థినులు

రాష్ట్రం నుంచి ఎంపికై న ఐదుగురిలో

ఇద్దరు మనోళ్లే

టీచర్‌ కల... విద్యార్థినుల రెక్కలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement