తంగళ్లపల్లి: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఓ యువకుడు మరో 15 రోజుల్లో స్వగ్రామానికి తిరిగి వస్తాడనుకుంటుండగా గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన షేక్ చాంద్ (30) మూడేళ్ల క్రితం బహ్రెయిన్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఓ గదిలో ఒంటరిగా ఉంటూ పనిచేసుకుంటున్నాడు. శనివారం ఉదయం చాంద్ నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చిన తోటి కార్మికులు ఈ విషయాన్ని యజమానికి తెలిపారు. యజమాని గది తలుపులు పగులగొట్టి చూడగా చాంద్ అప్పటికే మృతిచెంది ఉన్నాడు. గుండెపోటుతో చాంద్ మరణించినట్లు తోటి కార్మికులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, డిసెంబర్ 15న స్వగ్రామం వచ్చేందుకు చాంద్ ఇప్పటికే విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంతలోనే దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య ఫాతిమా, తల్లిదండ్రులు పెద్ద ఖాసీమ్‌బీ, హైదర్, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. చాంద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం, అధికారులు సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
చికిత్సపొందుతూ ఒకరు..
సైదాపూర్: మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన తాడూరి రాజు(40) బైక్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు.. రాజు గజ్వేల్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేసేవాడు. గత నెల 8న ఇంటి పని నిమిత్తం సైదాపూర్–హుజూరాబాద్ రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన రాజు కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య అనూష, కూతురు, కుమారుడు ఉన్నారు.


