కరీంనగర్ రీజియన్‌లో 11 డిపోలు.. 12 యూనియన్లు కార్మికుల ఓటుపై పార్టీల కన్ను ఒకవైపు కాంగ్రెస్– సీపీఎం అనుబంధ కూటమి మరోవైపు సీపీఐ అనుబంధ కూటమి ఈనెల 9న పోలింగ్
కరీంనగర్‌టౌన్: పదేళ్ల తర్వాత జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు కరీంనగర్ రీజియన్‌లో వేడి పుట్టిస్తున్నాయి. 11 డిపోల్లో యూనియన్లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రీజియన్ వ్యాప్తంగా 12 యూనియన్లు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం రెండు కూటముల మధ్యే కేంద్రీకృతమైంది. రాజకీయ పార్టీల అనుబంధాలు, కార్మిక సంఘాల పొత్తులు ఈసారి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
● 11 డిపోలు.. 2,830 ఓట్లు
కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్–1, 2, గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మంథని, సిరిసిల్ల, వేములవాడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,830 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్, ట్రాఫిక్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల ఉద్యోగులు ఉండగా, ఈనెల 9న యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
● యూనియన్లు ఇలా..
ఎన్నికల బరిలో మొత్తం 12 యూనియన్లు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్, స్టా ఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, నేషనల్ మజ్దూర్, కార్మిక సంఘ్, కార్మిక పరిషత్, బహుజన వర్కర్స్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్, స్టాఫ్ అండ్ వర్కర్స్, సామాజిక తెలంగాణ మజ్దూర్, బహుజన కార్మిక, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లు ఉన్నాయి.
● టీడబ్ల్యూయూ కూటమి
తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయు)కు కాంగ్రెస్ పార్టీ బహిరంగ మద్దతు ప్రకటించింది. దీనికి సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌బ్ల్యూఎఫ్) తోడైంది. ఐఎన్‌టీయూసీ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ) కూడా ఈ కూటమిలో భాగమైంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని ఈ కూటమి ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
● ఈయూ–టీఎంయూ–ఎన్‌ఎంయూ..
సీపీఐ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి నేతలు రాష్ట్రస్థాయి క్లాస్–లో శ్రీబస్సుశ్రీ, కరీంనగర్ రీజియన్ స్థాయి క్లాస్–6లో శ్రీనిచ్చెనశ్రీ గుర్తులపై ప్రచారం ఉధృతం చేశారు.
● మిత్రపక్షాలే ప్రత్యర్థులు
ఆర్టీసీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ప్రత్యేక చర్చకు దారితీశాయి. రాష్ట్ర రాజకీయాల్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు మాత్రం ఆర్టీసీ ఎన్నికల్లో వేర్వేరు కూటముల్లో నిలిచాయి. కాంగ్రెస్ మద్దతు పొందుతున్న టీడబ్ల్యూయూతో సీపీఎం అనుబంధ సంఘం అయిన ఎస్‌డబ్ల్యూఎఫ్ చేతులు కలిపింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లోని మిత్రత్వం.. ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో మాత్రం పోటీగా మారింది.
● హోరెత్తిన ప్రచారం
రీజియన్‌లోని డిపోలను కూటముల నేతలు చుట్టేస్తున్నారు. కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తూ తమ డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణను వివరిస్తున్నారు. సిరిసిల్ల, మంథని, హుస్నాబాద్, హూజురాబాద్, కరీంనగర్ 1, 2 డిపోలలో ఈయూ–ఎంయూ–ఎన్‌ఎంయూ కూటమి ప్రచారం నిర్వహించగా, మంథనిలోనూ ఇదే కూటమి నేతలు కార్మికులను కలిసి మద్దతు కోరారు. అయితే ప్రతీ డిపోలో ఏ యూనియన్‌కు ఎంత శాతం మద్దతు ఉంది? ఎవరి బలం ఎంత? అనే విషయంపై ప్రస్తుతం అధికారికంగా ధ్రువీకరించిన గణాంకాలు అందుబాటులో లేవు. దీంతో స్థానిక పరిస్థితులను అంచనాల ఆధారంగా కాకుండా.. ఆయా డిపోల్లో ప్రచారం, నాయకత్వం, కార్మికుల సమస్యల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది.
● కార్మిక సమస్యలే ఎజెండా..
పార్టీల మద్దతు, యూనియన్ల పొత్తులు ఎలా ఉన్నా.. కార్మికుల ప్రధాన సమస్యలు మాత్రం ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ వేతన సవరణ, బకాయిల చెల్లింపు, సిబ్బంది కొరత, పని భారం, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై యూనియన్లు తమ వాదనలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది, బస్సులు, పని పరిస్థితులు ఎలా ఉండాలి? డ్యూటీ గంటలు, సెలవులు, బదిలీలు, పదోన్నతులు, వేతన సమస్యలపై ఏ యూనియన్ ఎలా పోరాడుతుంది? అన్నది కార్మికుల్లో చర్చనీయాంశంగా మారింది.
● పదేళ్ల తర్వాత ఎన్నికలు
ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు 2016 జూలైలో జరిగాయి. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈసారి కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుర్తింపు పొందిన యూనియన్‌కు యాజమాన్యం, ప్రభుత్వం ముందు కార్మికుల సమస్యలను అధికారికంగా చర్చించే వేదిక లభించనుంది.
● కరీంనగర్‌లో కార్మికులు ఎవరి వైపు?
రాజకీయ పార్టీల మద్దతు ఒకవైపు.. యూనియన్ల పాత అనుబంధాలు మరోవైపు.. స్థానిక నాయకత్వం, కార్మికుల వ్యక్తిగత అనుభవాలు ఇంకోవైపు. దీంతో కరీంనగర్ రీజియన్‌లోని 11 డిపోల్లో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీకి ఓటా.. యూనియన్‌కు ఓటా.. తమ సమస్యల పరిష్కారానికి పోరాడే నాయకత్వానికే ఓటా? అన్నది కార్మికుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈనెల 9న బ్యాలెట్ బాక్సులో పడే ఓటు.. ఆర్టీసీలో వచ్చే కాలంలో కార్మికుల తరఫున ఎవరు మాట్లాడాలన్నది నిర్ణయించనుంది.
● ఎవరి ధీమా వారిదే
రీజియన్ పరిధిలో ఆర్టీసీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. కార్మిక సమస్యలపై గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయించే సత్తా తమకే ఉందనీ ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమి నేతలు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరో వైపు ఎస్‌డబ్యూయూ, ఎస్‌డబ్యూఎఫ్, ఎన్‌ఎంయూ మరో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచాయి.
● ఎన్నికల గుర్తులు ఇవే..
ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు– బతుకమ్మ, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్– నిచ్చెన, బహుజన వర్కర్స్ యూనియన్– కత్తెర, ఎంప్లాయీస్ యూనియన్– బస్సు, కార్మిక పరిషత్– బస్సు టైరు, కార్మిక సంఘం– పులి, బహుజన కార్మిక యూనియన్– ధర్మచక్రం, ఆర్టీసీ వర్కర్స్ యూనియన్– బాణం విల్లు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్– నక్షత్రం, నేషనల్ మజ్దూర్ యూనియన్– కాగడా చేయి, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్– త్రాసు, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌కు గద గుర్తులు కేటాయించారు.


