● హియరింట్‌ పేరిట రూ.15 లక్షలకే అప్పగింత ● కోల్పోయిన సంవత్సర ఆదాయం రూ.25 లక్షలు ● బల్దియా అధికారుల ఇష్టారాజ్యం ● ఆలస్యంగా వెలుగు చూసిన బాగోతం | - | Sakshi
Sakshi News home page

● హియరింట్‌ పేరిట రూ.15 లక్షలకే అప్పగింత ● కోల్పోయిన సంవత్సర ఆదాయం రూ.25 లక్షలు ● బల్దియా అధికారుల ఇష్టారాజ్యం ● ఆలస్యంగా వెలుగు చూసిన బాగోతం

Oct 6 2026 12:42 AM | Updated on Oct 6 2026 12:42 AM

● హియరింట్‌ పేరిట రూ.15 లక్షలకే అప్పగింత ● కోల్పోయిన సంవత్సర ఆదాయం రూ.25 లక్షలు ● బల్దియా అధికారుల ఇష్టారాజ్యం ● ఆలస్యంగా వెలుగు చూసిన బాగోతం

కరీంనగర్‌కార్పొరేషన్‌ : ‘వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడా కూర్చున్నా ఫర్వాలేదు’..అన్న సామెత నగరపాలకసంస్థలో కొంతమందికి అచ్చంగా సరిపోతుంది. నిబంధనలు.. ఆదాయం.. .చూడకుండా కాంట్రాక్ట్‌ అప్పగించడం బల్దియా అధికారులకే సాధ్యపడింది. కోర్టు, హియరింగ్‌ సాకులతో రూ.40 లక్షల చికెన్‌ వ్యర్థాల కాంట్రాక్ట్‌ను కేవలం రూ.15 లక్షలకు కట్టబెట్టిన వైనం కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.

ఏటా రూ.40 లక్షలు

నగరపాలకసంస్థ పరిధిలో చికెన్‌ వ్యర్థాలను సేకరించేందుకు 2022లో మొదటిసారిగా నగరపాలకసంస్థ టెండర్‌ పిలిచింది. నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం (తీర్మానం నంబర్‌ 2108, తేదీ 05.11.2022) మేరకు 2022–23 సంవత్సరానికి టెండర్‌ పిలిచారు. అనిరుద్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.40 లక్షలకు టెండర్‌ దక్కించుకుంది. రూ.40 లక్షలు నగరపాలకసంస్థకు చెల్లించి, షాప్‌ల నుంచి రూ.1,400 యూజర్‌ చార్జీలు వసూలు చేస్తూ, చికెన్‌ వ్యర్థాలను సేకరించాలి. అప్పటి నుంచి నగరంలో చికెన్‌ వ్యర్థాల సేకరణకు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఏటా రూ.40 లక్షలు ఆదాయం నగరపాలకసంస్థకు వస్తుండడంతో పాలకవర్గాలు సైతం చికెన్‌ వ్యర్థాల సేకరణ టెండర్‌కు మొగ్గుచూపాయి.

రూ.15 లక్షలకే అప్పగింత

నగరపాలకసంస్థకు ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో వాణిజ్య వ్యర్థాల సేకరణకు మొదటిసారి 13 మే, 2025న టెండర్‌ పిలిచారు. మహాఇన్‌ఫ్రా సంస్థ రూ.61,01,999 టెండర్‌ దక్కించుకుంది. కాగా, సీడీఎంఏ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న షెడ్యూల్‌ ప్రతిని ఈ టెండర్‌కు వినియోగించారు. ఈ సమయంలో షెడ్యూల్‌లోని 4వ అంశంలో చికెన్‌ వ్యర్థాలు అనే పదం ఉంది. ఈ పదం ఆధారంగా, చికెన్‌ వ్యర్థాల సేకరణ కూడా తమకే ఉంటుందని మహాఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులు నగరపాలకసంస్థ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే చికెన్‌ వ్యర్థాల సేకరణ అనేది ప్రత్యేకంగా టెండర్‌ పిలుస్తున్న వ్యవహారమని, రూ.40 లక్షల టెండర్‌ను నేరుగా ఇచ్చేది కాదని ముందుగా అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చికెన్‌ వ్యర్థాల సేకరణకు మరోసారి టెండర్‌ పిలిచారు. కానీ, చికెన్‌ వ్యర్థాలు అనే పదం టెండర్‌ షెడ్యూల్‌లో ఉందని, తమకే సేకరణ అప్పగించాలంటూ మహాఇన్‌ఫ్రా సంస్థ హైకోర్టును (డబ్ల్యూపీటీ నంబర్‌ 37963) ఆశ్రయించింది. దీంతో కోర్టు పిటిషనర్‌ను పిలిచి విచారణ (హియరింగ్‌) చేయాలని నగరపాలకసంస్థ అధికారులకు సూచించింది. కోర్టు సూచన మేరకు డిసెంబర్‌ 12, 2025న నగరపాలకసంస్థ అధికారులు మహాఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులను హియరింగ్‌ పిలిచారు. ఇక్కడే బల్దియా ఆదాయానికి భారీగా టెండర్‌ పడింది. హియరింగ్‌ అనంతరం రూ.40 లక్షల విలువైన చికెన్‌వ్యర్థాల టెండర్‌ను నేరుగా రూ.15 లక్షలకు మహాఇన్‌ఫ్రాకు అప్పగిస్తూ బల్దియా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా చికెన్‌వ్యర్థాల సేకరణకు పిలిచిన టెండర్‌ను రద్దు చేశారు. అయితే ఏ ఏటికి ఆ యేడు టెండర్‌ను పెంచుకుంటూ వెళ్లాల్సిన అధికారులు హియరింగ్‌ సాకుతో వచ్చే ఆదాయానికి కూడా గండిపెట్టి రూ.15 లక్షలకే కాంట్రాక్ట్‌ ఇవ్వడంపై అనుమానాలు వక్తమవుతున్నాయి. చికెన్‌వ్యర్థాల టెండర్‌లో జరిగిన గోల్‌మాల్‌పై విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. బల్దియా ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రైవేట్‌ వ్యక్తులకు లాభం చేకూర్చే ఈ టెండర్‌ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్నారు.

కోర్టు సూచనల మేరకే..

టెండర్‌ షెడ్యూల్‌లో చికెన్‌వ్యర్థాలు అనేది ఉండడంతో తమకు నేరుగా అప్పగించాలంటూ మహాఇన్‌ఫ్రా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు హియరింగ్‌కు ఆదేశాలు ఇవ్వడంతో, సంస్థతో హియరింగ్‌ నిర్వహించాం. ఒకవేళ తమకు అప్పగించకపోతే మళ్లీ కోర్టుకు వెళ్తామనడంతో, మరో ఏడాది నగరపాలక సంస్థ నష్టపోకూడదని రూ.15 లక్షలకు కాంట్రాక్ట్‌ అప్పగించాల్సి వచ్చింది.

– దుర్గాప్రసాద్‌రెడ్డి, వెటర్నరీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement