రక్షించాల్సిన పోలీసులే నిందితులుగా మారుతున్న వైనం
తోటివారిపై గంజాయి, దాడి కేసులకు కుట్రలు
చలాన్ల వసూళ్లు, వేతనాలలో గోల్‌మాల్, వాహనాల విడుదలకు రేట్లు
అవినీతి ఆరోపణలపై సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ అటాచ్
మహిళపై లైంగిక దాడి చేసి కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్
పీఎంజే, భగత్‌నగర్ దోపిడీల ఛేదనతో రాష్ట్రవ్యాప్త ప్రశంసలు
అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై వరుస కేసులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీ వ్యవస్థలో కొందరు సిబ్బంది వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా వెలుగుచూస్తున్న వరుస ఘటనలు పోలీసు శాఖలోని కొందరి తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అవినీతి, అధికార దుర్వినియోగం, అక్రమ వసూళ్లు, నకిలీ ధ్రువపత్రాలు, వ్యక్తిగత కక్షలకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం, మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వంటి ఘటనలు వరుసగా తెరపైకి వస్తుండటంతో శాఖలో పెరుగుతున్న అత్యాశ, క్రమశిక్షణ రాహిత్యాలను బహిర్గతం చేస్తున్నాయి. నిందితులపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులే కేసులు ఎదుర్కోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. పీఎంజే, భగత్‌నగర్ లాంటి కఠిన కేసులను కేవలం రోజుల్లో ఛేదించిన మెరికల్లాంటి ఆఫీసర్లను స్వయంగా డీజీపీ ఆనంద్ ప్రశంసించారు. ఏకంగా పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసును పోలీసు అకాడమీలో పాఠంగా చేర్చడం గమనార్హం. కానీ...అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొందరి అత్యాశతో నిజాయతీ అధికారులు సాధించి పెట్టిన ప్రతిష్ఠ మసకబారుతోంది.
అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలతో పట్టుబడిన ట్రాక్టర్లను విడుదల చేసేందుకు భారీమొత్తాన్ని డిమాండ్ చేశారన్న ఆరోపణలతో జిల్లాలో ఓ సర్కిల్‌లోని సీఐ, ఎస్సైలను ఉన్నతాధికారులు కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. కేసుల నమోదు చేయకుండా తొలుత రూ.30 వేలు, ఆపై మరింత డబ్బు కావాలని అడగడంతో బాధితుడు మీడియాకు ఆధారాలు విడుదల చేశాడు.
తాజాగా 8వ బెటాలియన్ (కొండాపూర్) టీజీఎస్పీ కానిస్టేబుల్‌పై లెంగిక దాడి, డబ్బు కోసం బ్లాక్‌మెయి ల్ కేసు నమోదైంది. పదోతరగతి క్లాస్‌మేట్ అయిన వివాహితను ఫోన్‌ద్వారా పరిచయం చేసుకొని వివాహేత ర సంబంధం పెట్టుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలను చూపి బెదిరించి రూ.1.30 లక్షలు తీసుకున్నాడని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోనూ ఓయో హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడడంతో కేసు నమోదైంది.
తాజాగా జూలై నెలలో కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఘటన సంచలనంగా మారింది. కొత్తపల్లి మండలానికి చెందిన టీజీఎస్పీ ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఒకరిపై కేసునమోదుచేసి అతని ఇంట్లో 370.96 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు.
మూడు నెలల క్రితం ట్రాఫిక్ చలాన్ల వసూళ్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ.34,700 అక్రమంగా జేబులో వేసుకున్నారనే ఆరోపణలు రాగా ఇందులో ఓ ఆర్‌ఎస్సై, ఓ రైటర్, ఒక కోర్టు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. జరిమానా వసూలు ప్రక్రియలో పారదర్శకత పాటించకపోవడం, ప్రజల నుంచి అదనపు మొత్తాలు తీసుకున్నారనే ఆరోపణలు పోలీసుశాఖ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి.


