తిమ్మాపూర్: చెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్నారని పోలీసులు సీజ్ చేసిన జేసీబీ, 3 ట్రాక్టర్ల రిలీజ్‌కు పోలీసులు లంచం డిమాండ్ చేయడం కలకలం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని సీపీ గౌస్ ఆలం తీవ్రంగా పరిగణించారు. తహసీల్దార్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా వాహనాలు వదలకుండా లంచం డిమాండ్ చేసిన తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్‌తోపాటు వైన్స్ షాపు నుంచి లంచం డబ్బులు తీసుకొచ్చిన కానిస్టేబు ల్‌ను కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బాబు అనే జేసీబీ యజమాని ట్రాక్టర్లతో తిమ్మాపూర్ గ్రామ శివారులో మట్టి రవాణా చేస్తుండగా ఎల్‌ఎండీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిలీజ్ కోసం తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. అక్కడ ఫైన్ చెల్లించి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్న బాబు.. వాహనాలను రిలీజ్ చేయాలని పోలీసులను కోరారు. అప్పటికే రూ.30వేలు చెల్లించిన బాబు.. వాహనం రిలీజ్ చేయాలంటే మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనతో అంత కాదని తాను చెల్లించలేనని చెప్పడంతో.. వాహనాలను మళ్లీ కోర్టుకు రాస్తామని, కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకోవాలని బెదిరించారు. వాహనాలు రిలీజ్ చేయకపోవడంతో విసిగి వేసారిన బాబు తన ఆవేదనను విలేకరుల ఎదుట వెల్లగక్కారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకున్నారు. తిమ్మాపూర్ సీఐ, ఎల్‌ఎండీ ఎస్సై, కానిస్టేబుల్‌పై ఒకేసారి చర్యలు తీసుకుంటూ అటాచ్ చేయడం సంచలనం రేపింది. ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ చరిత్రలో ఇద్దరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. జిల్లావ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ మారింది.
అర్ధరాత్రి వాహనాల రిలీజ్
ఎల్‌ఎండీ పోలీసులు సీజ్ చేసిన జేసీబీ, 3 ట్రాక్టర్లను ఆదివారం అర్ధరాత్రి విడుదల చేశారు. వాహనాల విడుదలకు లంచం డిమాండ్ చేసిన పోలీసులు తహసీల్దార్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా వాహనాలు విడుదల చేయలేదు. రూ.లక్ష ఇవ్వకుంటే కేసు కోర్టుకు రాస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు బాబు ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి సీఐ, ఎస్సై వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ‘సాక్షి’ లో లంచం ఇస్తేనే రిలీజ్ శీర్షిక కథనం ప్రచురితమైంది. ‘సాక్షి’ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.


