కరీంనగర్‌క్రైం : సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాది బోదాసు రమేశ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాదులు విధులకు గైర్హాజరై ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడికి చేసినవారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యవర్గ సభ్యులు బెజ్జంకి శ్రీకాంత్, సుంకే దేవ్‌కిషన్, బొజ్జ స్వామి, అనురాధ, భూమాచారి, శాంతికుమార్, న్యాయవాదులు పురెల్లి రాములు, కాశెట్టి శ్రీనివాస్, వీరస్వామి, శంకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్‌గా సంగెం లక్ష్మణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక రెడ్‌క్రాస్ కార్యాలయంలో పదాధికారులను ఎన్నుకున్నారు. ఆదివారం ఎన్నికై న సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, స్టేట్ ఈసీ మెంబర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి సీహెచ్.రామానుజాచార్య వెల్లడించారు. చైర్మన్‌గా ఎన్నికై న లక్ష్మణరావు టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శిగా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఇక వైస్ చైర్మన్‌గా వూట్కూరి రాధాకృష్ణారెడ్డి ఎన్నికవగా గతంలో రెడ్‌క్రాస్‌కు విశేష సేవలందించారు. కోశాధికారిగా గోనె శ్రీనివాస్ ఎన్నికవగా స్టేట్ ఈసీ మెంబర్‌గా కుందారపు మహేశ్వర్ ఎన్నికై నట్లు వివరించారు. నూతన కార్యవర్గాన్ని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల అరవింద్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్ధార్ హర్మిందర్‌సింగ్, మారుపాక రాజేశ్ భరద్వాజ్ తదితరులు అభినందించారు.
హుజూరాబాద్: పట్టణంలోని మామిండ్లవాడలో నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపడుతున్నారని అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ నవాజ్ పాషా గతంలో అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సోమవారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నవాజ్ పాషా ఆరోపించారు. ‘అక్రమ కట్టడాలపై ప్రశ్నించే అధికారం నీకు ఎక్కడిది.. నువ్వెవరు..’ అంటూ ప్రశ్నించారని తెలిపారు. తన ఫిర్యాదును కింద పడేసి, కార్యాలయంలో ఇచ్చి వెళ్లాలని కమిషనర్ అన్నారని ఆరోపించారు.
ఫిర్యాదుదారు పని చేసే ఆస్పత్రికి తాళం
నవాజ్‌పాషా పట్టణంలోని సూపర్‌బజార్‌లో నాగలింగం ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు తెలిసి, ఆ ఆస్పత్రికి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపునకు ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణంతో అధికారులు చర్యలు తీసుకున్నట్లు అతడి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు తాళం వేసినట్లు చెబుతున్నారు. అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసిన వ్యక్తి పనిచేస్తున్న ఆస్పత్రిపైనే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ అంశంపై డీఎంహెచ్‌వో రాజగోపాల్ మాట్లాడుతూ, ముందుగా ఆస్పత్రిని అధికారులు పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తేలితే కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తారని, అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకే తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా, నాగలింగం ఆస్పత్రికి తాళం వేసిన వ్యవహారంలో ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారో స్పష్టత రావాల్సి ఉంది.


