కరీంనగర్‌కల్చరల్: భారతీయ సనాతన సంస్కృతిని చాటిచెప్పే అత్యుత్తమ దేశభక్తి కావ్యంగా ‘జెండాపై కవిరాజు’ కవితా సంపుటి చిరస్థాయిగా నిలిచిపోతుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భగవతి పాఠశాలలో జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జెండాపై కవిరాజు’ కవితా సంపుటి ఆవిష్కరించి మాట్లాడారు. జాతీయవాద సాహిత్యం సమాజాన్ని చైతన్యపరిచే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ జాతీయ జెండా ఎగురవేసే వేళ ప్రతి భారతీయుడి గుండెల్లో ఉప్పొంగే దేశభక్తి, శౌర్యం, త్యాగనిరతికి ఈ కవితా సంకలనం అక్షర రూపమన్నారు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్ జాతీయ పూర్వ అధ్యక్షుడు కసిరెడ్డి వెంకటరెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు వడ్లూరు ఆంజనేయరాజు, కవి అవధాని గండ్ర లక్ష్మణరావు, భగవతి విద్యాసంస్థల చైర్మన్ రమణారావు, జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు గాజుల రవీందర్, సామల కిరణ్, నంది శ్రీనివాస్ పాల్గొన్నారు.
శ్లోక పఠనంలో విద్యార్థుల ప్రతిభ
కరీంనగర్‌కల్చరల్: భగవద్గీత శ్లోకాలను అలవోకగా పఠిస్తూ చిన్నారులు ప్రతిభ చాటారు. తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సప్తగిరికాలనీ కోదండ రామాయణంలో నిర్వహించిన శ్లోక పఠన పోటీలకు విశేషస్పందన లభించింది. ప్రాథమిక, హైస్కూల్‌స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 42మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ హిందువుల సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో సంస్కృతానికి విశిష్టస్థానం ఉందన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని భాషలకు మూలంగా నిలిచిన సంస్కృతాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్’గా పిలవడం సముచితమన్నారు. ప్రాథమిక పాఠశాల విభాగంలో 27మంది 10 శ్లోకాలను పఠించారు. హైస్కూల్ విభాగంలో 15మంది 20 శ్లోకాలను పఠించారు. వీరిలో ఏ.సహ స్ర, జి.అత్విక, జి.వేదసంహిత, ఏ.సాత్విక, జి.హృషికేష్, పి.శ్రీవేదలు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బి.కిషన్, ఎస్.మనోహరాచారి, గజేందర్‌రెడ్డి, వేణుగోపాల్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభకు ప్రోత్సాహమే లక్ష్యం
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రంలో ప్రతిభగల క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తోందని హెచ్‌సీఏ మెన్ క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. జిల్లా క్రికెట్ సదుపాయాల అభివద్ధి కమిటీ చైర్మన్ టి శేషనారా యణ్, హెచ్‌సీఏ మహిళా క్రికెట్ అభివృద్ధి విభాగాధిపతి సునీత ఆనంద్‌తో కలిసి ఆది వారం అలుగునూరులోని వీజేఆర్ అకాడమీని సందర్శించారు. కరీంనగర్‌లో హెచ్‌సీఏ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరి శీలించారు. కేడీసీఏ అధ్యక్షుడు వి.ఆగంరావు జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. హెచ్‌సీఏ మహిళా ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు సూచనలు అందించారు. కరీంనగర్‌లో టీజీ–20తో పాటు ఐపీఎల్, రంజీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత రమేశ్‌రెడ్డి, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మనోహర్‌రావు, ము రళీధర్‌రావు, మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.


