తిరుమల ఇండస్ట్రీస్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు 340 టన్నులు బియ్యం సీజ్ సీఎంఆర్‌గా చూపేందుకు నిర్వాహకుల ప్రయత్నం
హుజూరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రక్రియలో రైస్ మిల్లర్ల అక్రమాలు ఆగడం లేదు. ప్రభుత్వం నుంచి మద్దతు ధరతో సేకరించిన దొడ్డు వడ్లను మిల్లింగ్ చేయకుండానే మాయం చేస్తున్నారు. తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ కోటా కింద రేష న్ బియ్యాన్ని లెక్కల్లో చూపుతూ అధికారుల కళ్లు గప్పేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ భారీ దందాను టాస్క్‌ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలోని తిరుమల ఇండస్ట్రీస్ రైస్‌మిల్లుపై సివిల్ సప్లై, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం వేకువజామున ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 340 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమాని ఉపేందర్‌కు సమీప బంధువైన శీల శీను ఈ దందాకు సూత్రధారిగా గుర్తించారు. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్ మండలాల్లోని రేషన్ డీల ర్లు, చిన్న వ్యాపారుల నుంచి తక్కువ ధరకు బి య్యాన్ని సేకరించి తిరుమల ఇండస్ట్రీస్‌కు తరలిస్తున్నట్లు తేలింది. సేకరించిన రేషన్ బియ్యాన్ని మిల్లులో రీసైక్లింగ్ చేసి, కస్టమ్ మిల్లింగ్‌రైస్ (సీఎంఆర్) కింద ప్రభుత్వానికి లెక్క చూపిస్తూ భారీ మోసానికి పాల్పడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
తనిఖీలు జరుగుతుండగా తరలింపు
మిల్లులో తనిఖీలు జరుగుతున్న సమయంలో పరదాలు కప్పి మిల్లుకు తరలిస్తున్న సుమారు 50క్వింటాళ్ల రేషన్ బియ్యంతో రెండు ట్రాలీలను అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్లు తిరుపతి సురేశ్, అంగిడి తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పల నర్సింగాపూర్ డీలర్ నుంచి బియ్యం తీసుకొచ్చి నట్లు డ్రైవర్లు వెల్లడించాడు. బియ్యం నమూనాల ను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించారు.
రూ.కోట్లలో దందా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పౌరసరఫరాలశాఖ రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి నిర్ణీత గడువులోగా సీఎంఆర్ కింద బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు లేదా పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఆసరాగా చేసుకుని, తాము ఇవ్వాల్సిన సీఎంఆర్ కోటాను సన్నబియ్యంగా చూపిస్తూ రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల తక్కువ నాణ్యత గల బియ్యాన్ని సీఎంఆర్ కింద నెట్టేసేందుకు చూస్తున్నారు. ఈ వ్యవహారమంతా స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారుల కనుసన్నల్లోనే సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


