ఓటర్లు అందించాల్సిన సరైన పత్రాలు:
వివరాలు జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపాలి
కొత్త కలర్ ఫొటో అతికించండి
రసీదు తీసుకోవడం మరవద్దు
సాక్షి పెద్దపల్లి: ప్రతీపౌరుడికి ఓటుహక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈలక్ష్యంతో తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లిష్‌లో ఉండే ’ఎన్యూమరేషన్ ఫామ్’ అందిస్తారు. చాలామంది దీనిని నింపడానికి ఇబ్బంది పడుతుంటారు. సరైన సమాచారం అందిస్తేనే మీ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదవుతుంది. ఈ ఫామ్‌ను ఎలా నింపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏమిటి?
● ఇది ఓటరు జాబితాను ధ్రువీకరించడానికి, కొత్త ఓటరు వివరాలను సేకరించడానికి ఎన్నికల సంఘం ఉపయోగించే ప్రాథమిక ఫామ్. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఒక వేదిక. ఫామ్‌లో వివరాలు రాసేటప్పుడు తప్పులు లేకుండా, స్పష్టమైన అక్షరాలతో రాయాలి.
మొదటి భాగం:
రెండోభాగంలో రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. 2002లో ఓటు ఉన్నవారి కోసం ఒక బాక్స్, 2002లో ఓటు లేనివారి కోసం మరో బాక్స్ ఉంటుంది. ఈ రెండు అంశాల్లో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకోని నింపాలి.
ఫామ్‌పై భాగం:
మీ పేరు, మీ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫొటోతో ముందుగా ముద్రించి ఉంటాయి. అక్కడ పక్కన మీ లేటెస్ట్ ఫొటో అతికించాలి.
01–01–2002 నాటికి ఓటు ఉన్నట్లయితే:
2002 ఓటరు జాబితా వివరాల ఆధారంగా ఈ బాక్స్‌ని పూరించాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, సంరక్షకుడి పేరు, అతడితో మీకు ఉన్న బంధుత్వం వివరాలు నింపాలి. 2002 ఓటరు జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబరు(భాగం సంఖ్య), క్రమసంఖ్య.. అంటే ఓటరు జాబితాలో మీ సిరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి.
01–01–2002 నాటికి ఓటు లేకపోతే:
2002లో మీకు ఓటు లేదు, మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒకరి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ పూరించాలి. పేరు అనేచోట తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. బంధువు అనేచోట వారి తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబర్(భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్ లిస్ట్‌లో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేదు కావున, మీ బంధువుల్లో ఉన్న వారివివరాలను ఈ బాక్స్‌లో నింపాలి.
మూడో భాగం:
మూడోభాగంలో ఓటరు ప్రస్తుత వివరాలు నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తల్లిపేరు, తల్లి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, ఆమె ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అవ్వకపోతే ఖాళీగా వదిలివేయండి.
ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, పదో తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీహక్కుల ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. సరైన వివరాలు అందించడం వల్ల భవిష్యత్‌లో ఓటరు కార్డులో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు.
1. వ్యక్తిగత వివరాలు: కుటుంబ సభ్యులందరి పేర్లు, వయసు, లింగం వంటి వివరాలను ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి.
2. చిరునామా ధ్రువీకరణ: మీరు ఉంటున్న ఇంటి నంబర్, వీధి పేరు, పోస్ట్ ఆఫీస్ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.
3. ఆధార్ అనుసంధానం: ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌తో అనుసంధానించడానికి అవసరమైన వివరాలను అందించాలి.
4. ఫొటో, సంతకం: ఫామ్ చివరలో అవసరమైన చోట సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడం మర్చిపోవద్దు.


