చెరువుల కబ్జాతో నీటి ఎద్దడి | - | Sakshi
Sakshi News home page

చెరువుల కబ్జాతో నీటి ఎద్దడి

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

చెరువుల కబ్జాతో నీటి ఎద్దడి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో తాగునీటి ఎద్దడి.. చెరువులు, కుంటల కబ్జాలకు నిరసనగా సీపీఐ ఆందోళన చేపట్టింది. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయం గేట్‌ ముందు ఆ పార్టీ నాయకులు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న సీపీఐ శ్రేణులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ, మానేరు డ్యాం నుంచి పక్క జిల్లాలకు నీళ్లను పంపించి, నగరానికి మాత్రం నీటి కష్టాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే నగరంలోని చెరువులు, కుంటల కబ్జాలతో నీటి కష్టాలు పెరిగాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో సమస్య మరింత తీవ్రమవుతుందన్నారు. వెంటనే చెరువులు, కుంటలను కబ్జాల నుంచి రక్షించాలని, నీటి కష్టాలను తీర్చాలని డిమాండ్‌ చేశారు. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు పైడిపల్లి రాజు, బుచ్చన్న, పద్మ, అంజలి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యసనాలకు దూరంగా ఉండాలి

కరీంనగర్‌క్రైౖం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా జైలులో గురువారం ఖైదీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైదీలతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్‌ జి.విజయ్‌దేని మాట్లాడుతూ, మాదకద్రవ్యాలను కలిగి ఉండడం, కొనుగోలు, విక్రయం, రవాణా చేయడం తీవ్రమైన నేరమని, వాటికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జైలు వైద్యాధికారి కె.వేణుగోపాల్‌, ఫార్మసిస్ట్‌ ఆర్‌.శ్రీలత, జైలర్లు జి.లక్ష్మీనారాయణ, యు.పరశురాములు, డిప్యూటీ జైలర్లు ఎస్‌.సుధాకర్‌రెడ్డి, కె.అనిల్‌కుమార్‌, ఎస్‌.అజయ్‌చారి తదితరులు పాల్గొన్నారు.

యోధులను మరువలేం

కరీంనగర్‌: ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధులను మరువలేమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధులను సన్మానించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 1975 జూన్‌ 25న నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, అప్పటి ప్రధాని విధించిన అత్యవసర పరిస్థితి దేశానికి గొడ్డలిపెట్టులాంటిదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బాస సత్యనారాయణ, మాడ వెంకట్‌ రెడ్డి, మేకల ప్రభాకర్‌ యాదవ్‌, బోయినపల్లి ప్రవీణ్‌ రావు, కళ్లెం వాసుదేవ రెడ్డి, కన్నకృష్ణా, గుజ్జ శ్రీనివాస్‌ రావు, పుప్పాల రఘు, అలివెల్లి సమ్మిరెడ్డి, బండ రమణారెడ్డి, అనిల్‌, అడిచెర్ల రాజు, బండారి గాయిత్రి, తనుకు సాయికృష్ణ, రవీందర్‌, దాసరి రమణారెడ్డి, ఈసంపల్లి మహేశ్‌, తిరుమల్‌ రెడ్డి, వంగల ఆంజనేయులు, వాసు తదితరులు పాల్గొన్నారు.

టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

కరీంనగర్‌టౌన్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు గురువారం వెలువడ్డాయని డీఈవో ఎన్‌.ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో 125 మంది బాలురు, 64 మంది బాలికలు మొత్తం 189 మంది పరీక్షలకు హాజరు కాగా 124 మంది బాలురు, 62 మంది బాలికలు, మొత్తం 186 (98.41శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. విద్యార్థులు మార్కులు రీకౌంటింగ్‌కు రూ.500 లేదా రీవెరిఫికేషన్‌ కోసం రూ.1000 చెల్లించి ఈనెల 26 నుంచి జూలై 5వ తేదీ వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్‌ జిరాక్స్‌, మార్కుల మెమోలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement