ఐటీఐతో ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

ఐటీఐతో ఉపాధి అవకాశాలు

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

సద్వినియోగం చేసుకోవాలి

కరీంనగర్‌టౌన్‌: ఆసక్తి, తపన ఉంటే చాలు.. ఐటీఐ శిక్షణతోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. విదేశాల్లోనూ రాణించవచ్చు. మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయిని అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ ఐటీఐలు అడ్వాన్స్‌్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు (ఏటీసీ)గా విస్తరిస్తున్నాయి. వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో వివిధ పరిశ్రమల్లో ఎంపిక కానున్నారు. ఏటీసీ సెంటర్లను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులు. 2026–27 విద్యా సంవత్సరానికి ఈ నెల 8 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో విభిన్న ట్రేడులున్నాయి. విద్యార్థి అభిరుచికి తగిన కోర్సును ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఉన్నత చదువులు చదవలేని నిరుపేదలకు ఈ కోర్సులు వరంగా చెప్పుకోవచ్చు. వివిధ పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ నియామకాల్లో ఐటీఐ, ఏటీసీ చదవినవారికే ప్రథమ ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసినవారిలో సుమారు 85 శాతం వరకు ఉపాధి పొందుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

అందుబాటులో 1,824 సీట్లు

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 4 ఏటీసీలు ఉండగా, వాటిలో 1,824 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లిలో మూడు ప్రభుత్వ ఐటీఐల్లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)లను ప్రారంభించారు. కరీంనగర్‌ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గం తాడికల్‌, చొప్పదండి నియోజకవర్గం వెదిర, హుజూరాబాద్‌ నియోజకవర్గం రంగాపూర్‌లో ఏటీసీలు మంజూరయ్యాయి. భూసేకరణ, ప్రభుత్వ అనుమతులు వేగవంతంగా జరుగుతున్నాయి.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి

ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఐటీఐలో చేరే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ttps:// iti. telangana. gov. in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. కోర్సు ప్రతిపాదికన వెబ్‌ ఆప్షన్లు పెట్టి అన్ని ధ్రువపత్రాలను అప్లోడ్‌ చేయాలి. ప్రతిభ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. దరఖాస్తు సమయంలో ఉపయోగించే సెల్‌ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ మాత్రం కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగించాలి.

ఏటీసీలతో 85 శాతం ఉద్యోగాలు

కోర్సుల వివరాలు

ఒక సంవత్సరం కోర్సులు: డీజిల్‌ మెకానిక్‌, కంప్యూటర్‌, వెల్డర్‌, కోపా(కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామింగ్‌ అనలిస్ట్‌) తదితర కోర్సులు.

రెండు సంవత్సరాల కోర్సులు: డ్రాఫ్ట్‌స్‌మెన్‌ మెకానికల్‌, డ్రాఫ్ట్‌స్‌మెన్‌ సివిల్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మోటారు మెకానిక్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానిక్‌ తదితర విభాగాలు.

ఏటీసీలో కోర్సులు: మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌, కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌(ఏడాది), ఇండస్ట్రీయల్‌ రోబోటిక్స్‌, డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌(ఏడాది), బేసిక్‌ డిజైన్‌ అండ్‌ వర్చువల్‌ అనాలిసిస్‌ అండ్‌ డిజైనర్‌ (రెండేళ్లు), అడ్వాన్స్‌డ్‌ సీఎస్‌సీ మెకానిక్‌ టెక్నీషియన్‌ (రెండేళ్లు), మెకానికల్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్‌(రెండేళ్లు).

పదో తరగతి విద్యార్థులకు మంచి అవకాశం. ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇతర వివరాల కోసం అందుబాటులో ఉన్న ఐటీఐ కేంద్రాల్లో సంప్రదించాలి. ఐటీఐ, అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో(ఏటీసీ) చదివిన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉపాధి పొందవచ్చు. ప్రస్తుతం ఐటీఐ పాసైన విద్యార్థులకు హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో మల్టీ నేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి.

– కె.అశోక్‌కుమార్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌, కరీంనగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement