కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ పంచాయతీ పరిధిలోని అధర్వ్ రిసార్ట్స్‌లో ఓ యువకుడు అనుమానస్పదంగా మృతిచెందాడు. సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు..పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన దుర్శిటి సతీశ్‌కు ఇద్దరు కొడుకులు. చిన్నకుమారుడైన దుర్శిటి అఖిల్ (21) రెండునెలల నుంచి హైదరాబాద్‌లోని తుక్కుగూడ ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 30న జరిగిన ఎల్లమ్మ జాతరకు ఇంటికి వచ్చిన అఖిల్ నాలుగురోజుల పాటు ఉండి తిరిగి హైదరాబాద్ వెళ్లాడు. అయితే అఖిల్ తన సోదరుడి బైక్ తీసుకెళ్లగా, బైక్ కోసం ఫోన్ చేయడంతో స్నేహితుడు ఎలిగేటి అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి కమాన్‌పూర్‌లోని అధర్వ్ రిసార్ట్‌కు వచ్చినట్లు తెలిపాడు. తెల్లారి నిద్రలేచి చూసేసరికి అఖిల్ కనిపించడం లేదని వెతుకుతుండగా స్విమ్మింగ్‌పూల్ వద్ద షర్ట్, చెప్పులు కనిపించాయని మృతుడి తండ్రి, సోదరుడికి సమాచారమిచ్చారు. వారు రిసార్ట్ వద్దకు చేరుకొని వాచ్‌మెన్ నెల్లి అభి అలియాస్ ఆర్యప్రకాష్‌ను ఆరా తీసి వెతికారు. ఈ క్రమంలో అఖిల్ మృతదేహం స్విమ్మింగ్‌పూల్‌లో లభించింది. బర్త్‌డే పార్టీ ఉందని ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన ఎలిగేటి అరవింద్ తన కుమారుడిని పిలిచాడని, ఈ పార్టీలో 8 మంది యువతులు, 9 మంది యువకులు పాల్గొన్నట్లు తెలిసిందని మృతుడి తండ్రి తెలిపాడు. తన కొడుకు మృతిపై ఎలిగేటి అరవింద్, ముక్కెర అంజి, మరికొందరు స్నేహితులపై అనుమానం ఉందని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కాగా సదరు రిసార్ట్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


