సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని నెహ్రూనగర్ ప్రాథమిక పాఠశాల 1978లో ఏర్పాటైంది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో 2002లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయ్యింది. ఇంగ్లిష్ మీడియం ప్రాధాన్యత పెరగడంతో ప్రైవేట్ స్కూళ్లపై మక్కువ పెరగడంతో 2016లో విద్యార్థుల సంఖ్య 52కు తగ్గి మూతబడే పరిస్థితికి చేరింది. అప్పుడే ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాఠశాల సిబ్బంది, ఎస్‌ఎంసీ, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ బడిలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. దీంతో 2016లోనే 170కి పెరిగింది. ప్రస్తుతం 191 మంది చదువుకుంటున్నారు.
స్వచ్ఛ పురస్కారానికి అడుగులు ఇలా..
సురక్షిత తాగునీరు: దాతలు అందజేసిన ఆర్వో ప్లాంటు ద్వారా శుద్ధి చేసిన నీటిని విద్యార్థులకు అందిస్తున్నారు. శౌచాలయాల నిర్వహణ: టాయిలెట్స్ బాలికలు, బాలురకు సపరేట్‌గా నిర్మించారు. టాయిలెట్స్‌లో నిరంతరం వాటర్ సరఫరా, సబ్బులు, న్యాప్‌కిన్స్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంపు నిర్మించారు. హ్యాండ్‌వాష్,: మధ్యాహ్న భోజన సమయంలో సబ్బు నీళ్లు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థుల కెప్టెన్స్ వాటిని తోటి విద్యార్థులు వాడేలా చూస్తారు. టాయిలెట్ వెళ్లొచ్చిన వారితో ఖచ్చితంగా సబ్బుతో హ్యాండ్‌వాష్ చేయిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత: ప్రతీ తరగతిగదిలో డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌లో చెత్త వేయకుండా స్పెషల్ డస్ట్‌బిన్స్ ఉంచారు. పరిసరాల్లో గ్రీనరీ పెంచి బడిని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ఇంకుడు గుంత: బడిలో బోరు బావికి సమీపంలో ఆరు ఫీట్లలోతు ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. వర్షం నీరు దానిలోకి వెళ్లి భూగర్భ జలాలు పెరిగేలా నిర్మించారు.
తడి, పొడి చెత్త నిర్వహణ: బడిలో ఒక చోట కంపోస్టు గుంతను తవ్వించి కూరగాయల వేస్ట్‌ను వేస్తారు. నెల వరకు వర్మీకంపోస్టు తయారై బడితోటకు వినియోగిస్తున్నారు. బడితోట: తక్కువ స్థలంలోనే కొత్తిమీర, ఆకుకూరలు, వంకాయలు, మునగచెట్లు, దొండ పందిరి టమాటలు పెంచి వాటితో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వడ్డిస్తున్నారు. విద్యార్థి సంఘాలు: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రంథాలయ కమిటీ పుస్తకాలు చదివించడం, విద్యార్థులను సైలెన్స్‌గా ఉంచడం చేస్తుంది. పరిశుభ్రం పచ్చదనం కమిటీ ప్రతినిధులు మొక్కలు పెంచడం,వాటికి నీరు ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్న భోజన కమిటీ ద్వారా క్యూలైన్లు, చేతులు పరిశుభ్రంగా కడుక్కొని భోజనం చేసేలా చూస్తారు. పరిశుభ్రతపై అవగాహన: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేతులు కడుక్కోవడం, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లతో అవగాహన కల్పించడం, గోర్లు కత్తిరించడం వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎకోక్లబ్: మట్టితో వినాయకులు తయారుచేసి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. ప్రాజెక్టు వర్క్‌కింద పేపర్ బ్యాగుల తయారీ, సింగిల్‌ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఎర్త్‌డే, వాటర్ డే ప్రాధాన్యతలు వివరిస్తున్నారు.
ఈ స్ఫూర్తి కొనసాగిస్తాం
పిల్లల్లో పెరిగిన క్రమశిక్షణ, తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు ప్రోత్సాహంతో పాఠశాల గొప్ప మైలురాయికి చేరింది. ఇది చాలా సంతోషదాయకం. కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కడం పాఠశాల చరిత్రలో నిలిచిపోయిన సంఘటన. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం.
– వాసాల హరిప్రసాద్, హెచ్‌ఎం


