ఫెర్టిలైజర్‌సిటీ: అది ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల.. అక్కడ అడుగుపెడితే కార్పొరేట్ స్కూళ్లకు సైతం అసూయ పుట్టక మానదు. పచ్చని చెట్లు, పరిమళించే పూలమొక్కలు.. అద్దంలా మెరిసే పరిసరాలు.. అన్నింటికీ మించి విద్యార్థులపై ఉపాధ్యా యులకు ఉన్న అపారమైన ప్రేమ.. ఇవన్నీ కలగలిసి ఆ పాఠశాలను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ’ (ఎస్‌హేచ్‌విఆర్) రేటింగ్‌లో పాలకుర్తి మండలం ఎల్కలపల్లి మండల పరిషత్ పాఠశాల జాతీయస్థాయిలో 49వ ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా వందపాఠశాలలు పోటీపడగా.. తెలంగాణ నుంచి ఎంపికై న 10 స్కూళ్లలో ఎల్కలపల్లి బడి ఉంది. ఇది రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించడం విశేషం. తద్వారా కేంద్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించింది.
పచ్చదనం.. నందనవనం
ఎల్కలపల్లి బడి వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదం పంచుతోంది. హరితహారంలో నాటిన వివిధ రకాలమొక్కలు, పూలతోట నందనవనాన్ని తలపిస్తోంది. తరగతి గదుల చుట్టూ పచ్చదనం విద్యార్థులకు ప్రకృతి ఒడిలో చదువుకుంటున్న అనుభూతి కలిగిస్తోంది.
కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రశంసలు
జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి జిల్లా పేరును దేశపటంలో నిలిపిన ఎల్కలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆడెపు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. అన్నింటినీ ఇలాగే తీర్చిదిద్దితే కార్పొరేట్ కన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ముందుంటారని కొనియాడారు.
పరిసరాల పరిశుభ్రతలో నంబర్ వన్
పచ్చదనమే కాదు.. పరిశుభ్రతలోనూ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. సురక్షితమైన తాగునీరు, ఆధునిక శౌచాలయాలు, వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటిస్తోంది.
హెచ్‌ఎం సొంత ఖర్చులతో ఆటో సౌకర్యం
ప్రధానోపాధ్యాయుడు ఆడెపు లక్ష్మీనారాయణ దూర ప్రాంతాల నుంచి బడికి వచ్చే విద్యార్థుల కోసం తన సొంత ఖర్చులతో ఆటో సౌకర్యం కల్పించారు. విద్యార్థులను సురక్షితంగా బడికి తీసుకురావడం, తిరిగి ఇంటికి చేర్చడం ద్వారా ప్రవేశాలూ పెంచుతున్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం
పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ.. మధ్యాహ్న భోజనంతోపాటు ప్రతీవిద్యార్థికి అదనంగా పౌష్టికాహారాన్ని(న్యూట్రిషన్ ఫుడ్) అందిస్తున్నారు. పండ్లు, గుడ్లు, ఇతర పోషకాలు గల ఆహారం అందిస్తూ శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతున్నారు.
స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌లో జాతీయస్థాయిలో గుర్తింపు సాధించడం గర్వంగా ఉంది. ఉపాధ్యాయులు, పోషకులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే పాఠశాలను అభివృద్ధి చేశాం. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.
– ఆడేపు లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం,
ఎల్కలపల్లి మండల పరిషత్ పాఠశాల


