విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థిని మృతిచెందడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్‌కు చెందిన ఇజా(4) ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఇజా బుధవారం స్కూల్‌కు ఆరోగ్యంగా వెళ్లిందని తల్లిదండ్రులు ఫరీదా, ఫారుక్‌ తెలిపారు. సాయంత్రం ఇజా ఆరోగ్యంం బాగాలేదని పాఠశాల టీచర్‌ ఫోన్‌లో తెలిపిందన్నారు. వెంటనే ఇజాను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని, పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలిస్తుండగా మృతిచెందినట్లు తెలిపారు. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇజా మృతిచెందిందని రోదించారు. ఇజా మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాలలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీతో ఏం జరిగిందో విచారణ చేయాలని కోరారు. ఎస్సై జ్యోతి పాఠశాలకు చేరుకుని బాధితులను శాంతింపజేశారు. ఇజా మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు.

లైసెన్స్‌ లేని సెక్యూరిటీ

ఏజెన్సీలపై కొరడా

కరీంనగర్‌ క్రైం: కమిషనరేట్‌ పరిధిలో లైసెన్స్‌ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడు ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం–2005 (పీఎస్‌ఏఆర్‌ఏ) ప్రకారం లైసెన్స్‌ పొందిన తర్వాతే సేవలు అందించాలని సీపీ గౌస్‌ ఆలం హెచ్చరించారు. గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్‌ వన్‌టౌన్‌, కరీంనగర్‌ టూటౌన్‌, చొప్పదండి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఏడు సెక్యూరిటీ ఏజెన్సీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏజెన్సీల ద్వారా సుమారు 146 మంది సెక్యూరిటీ గార్డులు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా సెక్యూరిటీ సేవలు నిర్వహించడం నేరమని, సంబంధిత యజమానులు వెంటనే అవసరమైన లైసెన్సులు పొందాలని సూచించారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

మల్యాల: మండలకేంద్రంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళం పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఎస్సై సందీప్‌ కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన కాలువల సత్య భర్త దుబాయ్‌ వెళ్లాడు. ఆమె కుమారుడితో కలిసి కరీంనగర్‌లో నివసిస్తోంది. సత్య తల్లి బుచ్చవ్వ ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేస్తోంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఇంటిని శుభ్రపరిచేందుకు వెళ్లగా.. తాళం పగులగొట్టి కనిపించింది. దీంతో సత్యకు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా.. ఆమె చేరుకుని ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువా పగులగొట్టి ఉంది. అందులో దాచిన రెండు తులాల బంగారం, 35 తులాల వెండి చోరీకి గురైనట్లు గుర్తించింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement