పాలకుర్తిటౌన్: అక్రమ సంపాదన కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న దేవరుప్పుల గ్రామంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై సృజన్‌కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, దేవరుప్పులకు చెందిన చింత సుదర్శన్, ఇదే మండలంలోని కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్య దొంగనోట్లు తయారు చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి కరెన్సీ, ప్రింటర్, కారు, రూ. 8500 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదించిన ఎస్సైతోపాటు సిబ్బంది యాకూబ్, యాకేశ్, దామోదర్, అశోక్‌ను డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు.
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న మొహమ్మద్ రియాజ్(28) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రియాజ్ పుట్టుకతోనే మూగ, చెవిటి. కాలనీలోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుండేవాడు. తనకు వివాహం చేయాలని తండ్రితో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 23న ఇంటికి వచ్చిన రియాజ్‌తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశాడు. తల్లితో అర్ధరాత్రి వరకూ మాట్లాడి ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. బుధవారం చూసేరికి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


