కరీంనగర్ అర్బన్: చిరుధాన్యాల సాగులో యాజ మాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలతోనే లాభాలు గడించవచ్చని భారతీయ చిరుధాన్యాల సంస్థ శాస్త్రవేత్తలు అనురాధ, దీపిక, శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో షెడ్యుల్ కులాల ఉపప్రణాళిక ద్వారా చిరుధాన్యాల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణపై శిక్షణ, వ్యవసాయ ఉత్పాదకాల పంపిణీ చేపట్టారు. చిరుధాన్యాల సాగు వివరాలు, ఖేత్ బచావో అభియాన్ ముఖ్య ఉద్దేశాలను వివరించారు. చొప్పదండి, చిగురుమామిడి మండలాలకు చెందిన వివిధ గ్రామాల 40మంది షెడ్యూల్ కులాల రైతులకు 3 కిలోల పీవైపీఎస్–2 జొన్నలు, 2కిలోల పీఆర్‌ఎస్–2 రాగులు, బయో పెస్టిసైడ్స్ ట్రీకోడెర్మా, ఇమిడాక్లోప్రిడ్, ప్రొపికోనజోల్, కార్బొఫురన్ గుళికలు, టార్పాలిన్లు తదితర ఉత్పాదకాలను పంపిణీ చేశారు. తెలంగాణ రైతు విజ్ఙాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బోగరి హరికృష్ణ, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి బి.రాంప్రసాద్, శాస్త్రవేత్తలు ఇ.రజనీకాంత్, జి.ఉషారాణి, ఇ.ఉమారాణి పాల్గొన్నారు.


