భూ గర్భజలాలు(లోతు మీటర్లలో)
జిల్లాలో పలుచోట్ల ఎండుతున్న వ్యవసాయ బావులు
గతేడాది కన్నా దారుణంగా పడిపోయిన భూగర్భ జలాలు
గంగాధరలో 15 మీటర్ల లోతున నీరు
పలు మండలాల్లో ఎనిమిది మీటర్ల లోతున..
కీలక జలాశయాలపై ఆశలు ఆవిరి
బోర్లు వేస్తేనే సాగు చేస్తామంటున్న కౌలు రైతులు
బోరు వేసినా పారడం లేదు
మోటబావి
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
వాన ముఖం చాటేసింది. సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ సారి వ్యవసాయ బావులే సాగు కు దిక్కనుకుంటే అక్కడా తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు జాడ లేకుండా పోయాయి. ఫలితంగా ఆరుద్ర కార్తె ప్రవేశించినా నేటికీ సరైన వర్షపాతం లేక రైతులు పొలాలు దున్నేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు వ్యవసాయశాఖ నీరు అధికంగా తీసుకునే పంటలు కాకుండా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి తమను ప్రకృతి బలంగా పగబట్టినట్లుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేశాయి, సాగునీరు అందించే జలాశయాల్లో నీళ్లు అడుగంటాయి, కనీసం వ్యవసాయ బావి మీద ఆధారపడి పంటలు సాగు చేసుకుందామంటే భూగర్భజలాలు దారుణంగా పడిపోడి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు.
దారుణంగా పడిపోయిన జలాలు
జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. గతేడాది మేతో పోల్చినప్పుడు గణనీయస్థాయిలో నీటిమట్టాలు పడిపోయాయి. ముఖ్యంగా గంగాధర మండలంలో భూ ఉపరితలం నుంచి 15 మీటర్లలో బావులన్నీ ఎండిపోయాయి. చొప్పదండి మండలంలోనూ నీటిమట్టం 14 మీటర్ల లోతున పడిపోయి అదే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ రూరల్, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట మండలాల్లో నీటి మట్టాలు కేవలం 4 మీటర్ల వరకే వెళ్లి నిలిచిపోయాయి. ఈ మండలాల్లో చుట్టుపక్కల ఎల్‌ఎండీ, ఎంఎండీ, పెద్ద చెరువులు ఉన్న కారణంగా ఇక్కడ భూగర్భ జలాలు అంతగా పడిపోలేదు. మిగిలిన మండలాల్లో సరైన నీటివనరులు లేకపోవడంతో ఇక్కడ భూగర్భజలాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. గతేడాది ఆయా మండలాల్లో భూగర్భ జలాలు మీటరు లోపే ఉండటం గమనార్హం.
బోర్ల వైపు చూస్తున్న రైతులు..
ప్రస్తుతం సాగునీరు వచ్చే పరిస్థితి లేకపోవడం, వ ర్షాలు ముఖం చాటేయడం, బావులలో నీరు పాతాళానికి పోతుండటంతో రైతులు తిరిగి బోర్లు వేసే ఆలోచనలో ఉన్నారు. ఎలాగైనా ఈసారి పంటే వేయాలన్న పట్టుదలతో బోర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి పారుదల సౌకర్యం ఈసారి అంతగా కనిపించకపోవడంతో కౌలు రైతులు పొలాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. బోర్లు లేకుండా పంట వేయలేమని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ బావులలో నీళ్లు అడగంటడం.. బోరు బావులు కొన్ని నిమిషాలు మాత్రమే నడవడంతో కొన్ని బావుల వద్ద నారు మడులు అంతంత మాత్రంగా తడుస్తున్నాయి.
మండలం మే 2026 మే 2025
చిగురుమామిడి 7.71 0.40
చొప్పదండి 14.37 –1.25
ఇల్లందకుంట 5.62 0.27
గంగాధర 16.13 15.89
గన్నేరువరం 7.59 8.13
హుజూరాబాద్ 7.29 7.46
జమ్మికుంట 4.30 4.79
కరీంనగర్ 11.74 13.38
కరీంనగర్ రూరల్ 3.45 3.82
కొత్తపల్లి 9.15 9.01
కేశవపట్నం 5.86 6.16
మానకొండూరు 2.03 4.10
రామడుగు 11.03 10.57
సైదాపూర్ 4.91 6.72
తిమ్మాపూర్ 8.48 9.82
వీణవంక 4.64 4.88
నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి, పారకానికి బావి ఉంది. ఈ బావిలో నీళ్లు అడుగంటి పోవడంతో రూ. మూడున్నర లక్షలు ఖర్చు చేసి 720 ఫీట్ల బోరు వేయించాను. ప్రస్తుతం బోరు 20 నిమిషాలు నడుస్తోంది. ఆ నీరు పశువులు తాగడానికే సరిపోతోంది. నారుమడికి పారడం లేదు. కాలం కరుణిస్తేనే పొలం సాగు చేస్తా. – అమ్ముల ఐలయ్య, గోపాల్‌రావుపల్లి, గంగాధర మండలం


