న్యూస్‌రీల్
డ్రైనేజీల్లో ప్లాస్టిక్ గుట్టలు
‘చేతిలో వాటర్ బాటిల్. నీళ్లు తాగడం ఆలస్యం. రోడు పక్కన డ్రైనేజీలో పడవేయడమే. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉందా డ్రైనేజీలో వేసేయడమే. పండ్లు, కూరగాయలు.. కవర్ ఏదైతేనేం డ్రైనేజీల్లో విసిరిస్తే సరి’ ఇలా పాదాచారులు, పరిసర నివాసితులు, దుకాణదారులు ఇష్టారీతిన పడవేస్తున్న ప్లాస్టిక్ డ్రైనేజీల్లో భూతంలా మారుతోంది. డ్రైనేజీలు, నాలాల్లో గుట్టలుగా పేరుకుపోయి మురుగునీటిని ముందుకు కదలనీయడం లేదు. దీంతో మురుగునీరు నిలిచిపోయి ఆ ప్రాంతమంతా దుర్వాసన, పందులు, దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. వర్షాకాలం వరద ముందుకు వెళ్లలేక రోడ్డెక్కడం, ఇండ్లను ముంచెత్తడం సాధారణంగా మారింది. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నగరంలో కొద్దిరోజులుగా డ్రైనేజీలు, నాలాల్లో సిల్ట్ తొలగిస్తున్నారు. ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు దర్శనమిస్తున్నాయి. మంగళవారం నగరంలోని జ్యోతినగర్ శివ థియేటర్ సమీపంలో మెయిన్‌రోడ్డు వెంట డ్రైనేజీల్లో సిల్ట్ తీశారు. దుకాణాలు, వ్యాపారసంస్థలు అధికంగా ఉండే ఆ డ్రైనేజీ నుంచి కనీసం రెండు ట్రాక్టర్ల లోడ్‌కు మించి ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు బయటపడడం నగరపాలకసంస్థ అధికారులనే కాదు, ఆ రోడ్డు వెంట వెళ్లే వాళ్లనూ షాక్‌కు గురిచేసింది. ప్లాస్టిక్ గుట్టలను నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ చూసి ఆశ్యర్యపోయారు. ఒక్క డ్రైనేజీలోనే రెండు ట్రాక్టర్ల లోడ్‌కు పైగా ప్లాస్టిక్ బయటపడితే, నగరవ్యాప్తంగా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఇదిలా ఉంటే డ్రైనేజీల్లో సిల్ట్ ఎప్పటికప్పుడు తీస్తే ఈ పరిస్థితి ఉండదని, ఏడాదికి ఒకసారి తీస్తే ఇలానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. – కరీంనగర్ కార్పొరేషన్
పరిశీలిస్తున్న కమిషనర్ ప్రఫుల్ దేశాయ్


