జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 91,178 మంది
535 పోలియో బూత్‌లు ఏర్పాటు, 1,00,300 వ్యాక్సిన్ డోసులు సిద్ధం
డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీరామ్
కరీంనగర్: ఈ నెల 28న జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న పల్స్ పోలియోను విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీరామ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, సూపర్‌వైజరీ సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ జిల్లాలో సున్నా నుంచి ఐదు సంవత్సరాల్లోపు వయసు గల 91,178 మంది చిన్నారులను గుర్తించామని, వారికి పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 535 పోలియో బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటికే 1,00,300 వ్యాక్సిన్ డోసులు చేరాయని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
సిబ్బందికి సమగ్ర అవగాహన
బూత్‌ల నిర్వహణ, వ్యాక్సిన్ నిల్వ, రవాణా, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్, ఇంటింటి సందర్శనలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా వలస కార్మికులు, సంచార జాతుల (మైగ్రెంట్) కుటుంబాల పిల్లలను గుర్తించి, వారికిచుక్కలు అందేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుధ, పీవోడీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, పీవోఎంహెచ్‌ఎన్ డాక్టర్ సనా, డాక్టర్ విప్లవశ్రీ, పీవోఎన్‌సీడీ డాక్టర్ ప్రభుదాస్ పాల్గొన్నారు.


