ఈకేవైసీ చేసుకోవాల్సిందే
● రేషన్, గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ తప్పనిసరి ● బోగస్ ఏరివేతకు కేంద్రం నిర్ణయం
● ఈ నెలాఖరులోపు చేసుకోకుంటే రాయితీ రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
కరీంనగర్‌అర్బన్: బోగస్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేపడుతోంది. గ్యాస్ కనెక్షన్‌దారులు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలని లేకుంటే గ్యాస్ రాయితీ రద్దవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కలెక్టర్ చిత్రా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించారు. అలాగే రేషన్ కార్డు యజమానితో పాటు సభ్యులంతా ఈకేవైసీ చేసుకోవాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించగా జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రేషన్ దుకాణాల్లోనే సదరు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ప్రతినెలా 1 నుంచి 15–17వరకు సరుకుల పంపిణీ ఉంటుండగా డీలర్లు సరిగ్గా స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఈకేవైసీ జరిగింది కేవలం 71.86శాతమే. మూడేళ్ల కిందటే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం సూచించింది. కానీ, ఆచరణలో ఆమడదూరం.
బోగస్ కనెక్షన్లు ఎన్నో?
రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను పరికిస్తే విస్తుపోవాల్సిందే. జిల్లాలో 10శాతం కుటుంబాలకే రేషన్ కార్డులు లేవని సమాచారం. బడా రాజకీయ నేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, సీఏలు, పలు కంపెనీల్లో కీలక పాత్ర పోషిస్తున్నవారు మినహా అందరికీ రేషన్ కార్డులున్నాయి. రేషన్ కార్డుల సంఖ్య 3.17లక్షలు కాగా గ్యాస్ కనెక్షన్లు 4.37లక్షలు అంటే 1.20లక్షల కనెక్షన్లు అదనంగా ఉన్నాయి. ఇందులో 20వేల కనెక్షన్లను మినహాయించినా లక్ష కనెక్షన్లు అదనమే. ఈ లెక్కన బోగస్ కనెక్షన్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కనెక్షన్లలో చాలావరకు మృతిచెందినవారి పేరున ఉన్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తయితే అక్రమాల చిట్టా వెలుగుచూడనుంది.
నెలాఖరులోపు చేసుకోకుంటే రాయితీ రద్దు
గ్యాస్ కనెక్షన్ ఉన్నవారంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందే. సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి వేలిముద్ర, ఐరిస్ ఇస్తే సరిపోతుంది. ఒక కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలనేది నిబంధన కాగా పలువురు రెండుమూడు ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఈకేవైసీ పూర్తయితే ఒకే గ్యాస్ కనెక్షన్‌కు సబ్సిడీ రానుంది. మరోరకంగా అక్రమ కనెక్షన్ల సంఖ్య వెలుగుచూడనుంది. మహాలక్ష్మి పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 గ్యాస్ బండ ఇస్తుండగా ఉజ్వల పథకం కింద కేంద్రం రాయితీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేవైసీ చేసుకోకుంటే ఇవేవీ వర్తించవని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు.
నత్తనడకన రేషన్ కేవైసీ
రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేసుకునే ప్రక్రియలో ఏలాంటి గడువు లేకపోగా ఎప్పుడైనా గడువు విధించవచ్చని, నిజమైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కార్డులోని ప్రతి సభ్యుడు వేలిముద్ర, ఐరిస్ స్కాన్ ధ్రువీకరణ చేయించుకోవాలి. రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణంలోనైనా ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. కాగా, రేషన్ షాపులు మాత్రం మూసివేసి ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సరుకులు ఇచ్చేటప్పుడు మాత్రమే డీలర్లు దుకాణం తెరుస్తుండగా మిగతా సమయాల్లో సేవలందించడం లేదు. పరిస్థితి ఇలాగుంటే ఈకేవైసీ ఎలా చేసుకోవాలని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర కార్డుల్లో ఇప్పటివరకు 70 శాతానికి పైగా ఈ ప్రక్రియ పూర్తయింది. మిగతా కార్డుదారులు తప్పకుండా ఈ–కేవైసీ చేయించుకోవాలి.
– నర్సింగరావు,
జిల్లా పౌరసరఫరాల అధికారి


