కరీంనగర్‌అర్బన్: రైతుల ప్రయోజనమే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతుండగా రైతు వేదికలను వేదికగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 30వరకు విత్తన మేళా నిర్వహించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. దీంతో విత్తన మేళా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 76 రైతు వేదికల్లో మేళా నిర్వహించనున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశం కాగా కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ సీడ్ కార్పొరేషన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్థానికంగా ఉండే విత్తన డీలర్లు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సన్నరకాలైన బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్‌ఎం–7715, డబ్ల్యూజీఎల్–44 విత్తనాలు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే కంది, పెసర, మినుములు, నువ్వులు, వేరుశనగ, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు ఉండనున్నాయి.
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దయతోనే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు రాజకీయంగా ఎదిగాడని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. సోమవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడారు. శ్రీధర్‌బాబుపై మధు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. మధుకు రాజకీయ భిక్ష పెట్టిందే శ్రీధర్‌బాబు కుటుంబమన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే మధు రూ.900 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం రూ.3 లక్షల కోట్లు దోచుకుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ కాకముందు ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఎంత అనే విషయాలను మధు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇసుక దందా, గంజాయి వ్యాపారాలు, హత్యా రాజకీయాలు చేసిన చరిత్ర ఆయనదని ధ్వజమెత్తారు. తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల పాల్జేసి, అందులో రూ.3 లక్షల కోట్లను కేసీఆర్ కటుంబం దోచుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.1.50 లక్షల కోట్ల వ్యయంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని, బీజేపీలో ఆ పార్టీ విలీనం కావడం ఖాయమన్నారు. నాయకులు సముద్రాల అజయ్, గోషిక శంకర్, రవీందర్ పాల్గొన్నారు.
కరీంనగర్‌క్రైం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమాలను సోమవారం సీపీ గౌస్ ఆలం పోస్టర్ విడుదల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమాలల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, డ్రగ్–ఫ్రీ క్యాంపస్ డిక్లరేషన్ తదితర కార్యక్రమాలు వారం పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు టీజీ ఏప్‌సెట్– 2026 తొలి విడత కౌన్సెలింగ్ సోమవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలిపారు. మొదటి రోజు స్లాట్ బుక్ చేసుకున్న 609 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించినట్లు పిన్సిపాల్ వివరించారు.


