వానమ్మా.. రావమ్మా | - | Sakshi
Sakshi News home page

వానమ్మా.. రావమ్మా

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

మృగశిర ముగిసి.. ఆరుద్ర ప్రవేశిస్తున్నా.. కానరాని చినుకు

మొలకెత్తని వేసిన విత్తనాలు

అందని రైతుబంధు, పంట డబ్బులు

ఆందోళన చెందుతున్న అన్నదాతలు

కరీంనగర్‌ అర్బన్‌: మృగశిర ముగిసి నేటినుంచి ఆరుద్ర కార్తె ప్రవేశిస్తుండగా జాడలేని వానలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎండలు దంచి కొడుతుండగా.. వేసిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక విత్తనాలు మొలవడం లేదు. మొలిచి నా నిలవడం లేదు. ప్రభుత్వ ఆదరణ ఉందా అంటే అదీ లేదు. రైతు భరోసా జాడ లేకపోగా.. రైతు బీమా ఊసే లేకుండా పోయింది. రాయితీ విత్తనాల మాట వినిపించక పోగా.. అటు ప్రకృతి.. ఇటు ప్రభుత్వం రిక్తహస్తం చూపుతుండటంతో అన్నదాత బతుకు జీవుడా అంటూ బిక్కుబిక్కుమంటున్నాడు.

వర్షాభావంతో రూ.కోట్లలో నష్టం

మృగశిర ఆరంభంలో వర్షాలు ఊరించగా అంతలోనే ముఖం చాటేశాయి. జిల్లాలో కొత్తపల్లి, రామడుగు, గంగాధర, చొప్పదండి, గన్నేరువరం, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్‌, శఽంకరపట్నం, మానకొండూరు, వీణవంక, సైదాపూర్‌ తదితర ప్రాంతాల్లో పత్తి సాగు చేశారు. నేలలో ఆశించిన వర్షపాతం నమోదవకుండానే దుక్కిలోనే విత్తనాలు వేశారు. విత్తనాలు వేసి 15రోజులు దాటగా 75శాతమే మొలక రాగా ప్రస్తుతం ఆ మొక్కలూ వాడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే జిల్లాలో రూ.70కోట్ల వరకు నష్టం వాటిల్లనుంది. దుక్కులు, విత్తనాలతో పాటు కూలీ ఖర్చులు తడిసి మోపెడవనున్నాయి.

బ్యాంకర్ల కొర్రీలు

సకాలంలో రుణాలివ్వాల్సిన బ్యాంకర్లు ఏటా కొర్రీలతో వేధిస్తుండగా ఈ సారి రుణ ప్రణాళికే ఖరారు కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అనువైన సమయంలో రుణాలందితే రైతులకు కొండంత అండగా ఉండేది. అలాంటిది ఇప్పటి వరకు కమిటీ స మావేశం కాకపోవడం రుణ ప్రణాళికను ఆమోదించకపోవడం దేనికి సంకేతమని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ ఇంకా పరిపూర్ణం కాకపోవడంతో లబ్ధిదారుల సేకరణలో బ్యాంకర్లు తలమునకలయ్యారు.

విత్తనాలు ఏవి?

రాయితీ విత్తనాలకు మంగళం పాడగా పచ్చిరొట్ట మాత్రమే ఇస్తున్నారు. వరి విత్తనాలు ఆశించినస్థాయిలో ఇవ్వడం లేదు. వేరుఽశనగ, కందులు, శనగ, మినుములు, పెసలు ఇతర విత్తనాలు గతంలో ఆన్‌లైన్‌ ద్వారా పంపిణీ చేయగా రెండేళ్లుగా ఆ ఊసే లేదు. ఏటా పంపిణీ చేసే విత్తనాలు క్షేత్రస్థాయి డిమాండ్‌కు సరిపోవడం లేదు. పరిఽశోధన స్థానాలు గానీ విత్తనాభివృద్ధి సంస్థలు విత్తనాల నిల్వలపై ప్రచారం చేయకపోవడం శోచనీయం.

పంట డబ్బులు రాలేదు.. రైతు భరోసా జాడ లేదు

అన్నదాతకు ఆర్థిక భరోసాగా ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుండగా ఇంకా అతీగతి లేదు. యాసంగి సీజన్‌లో కేవలం ఎకరానికి మాత్రమే పెట్టుబడి సాయం రూ.6వేలు రైతుల ఖాతాలో పడింది. లక్షల మందికి సాయం అందాల్సి ఉండగా స్పష్టత లేదు. తాజాగా వానాకాలం సీజన్‌కు పెట్టుబడి సాయం పడాల్సి ఉండగా, ప్రక్రియ మొదలు కాలేదు. జిల్లాలో గత సంవత్సరం వానాకాలం సాగులో రూ.150కోట్లు విడుదల చేయగా అంతకుముందు యాసంగికి గానూ రూ.145కోట్లు జమ చేశారు. ఇక ధాన్యం, మక్కలు విక్రయించిన రైతులకు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలు చేసిన 48గంటల్లోనే నగదు ఖాతాకు చేరుతుందని ప్రభుత్వం ప్రకటించగా క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితి నెలకొంది.

రైతు బీమా ఏది?

సహజ మరణమైనా, ఏ కారణంతో మరణించినా రైతు బీమా కింద సదరు కుటుంబానికి రూ.5లక్షలు రావాల్సి ఉండగా వందకు పైగా బాధిత కుటుంబాలు నిరీక్షిస్తున్నాయి. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండగా ప్రభుత్వ సాంత్వన కరవైంది. 60ఏళ్లలోపు వయసు ఉంటే బీమాకు అర్హత కాగా ఏడాదికి పైగా బీమా సొమ్ము కోసం పడిగాపులు కాస్తున్నారు. 120మందికి బీమా డబ్బులు రావాల్సి ఉండగా అవి సదరు కుటుంబాలకు ఎంతో ఆసరా. ఎల్‌ఐసీకి ఏటా బీమా ప్రీమియం ప్రభుత్వం రెండు సార్లు చెల్లించాల్సి ఉండగా గత ఫిబ్రవరిలో చెల్లించలేదని సమాచారం.

జిల్లాలో సాగు విస్తీర్ణం

3,41,056ఎకరాలు(అంచనా)

వేసిన పత్తి: 40,500ఎకరాలు

విత్తన ఖర్చు: 11.50కోట్లు

డ్రైస్పెల్‌ ఇలాగే 3రోజులు సాగితే..

విత్తన, దుక్కి, లేబర్‌ ఖర్చులు వృథా

జూన్‌లో ఇప్పటి వరకు కురవాల్సిన వాన 98.3మిల్లీ మీటర్లు

నమోదైన వర్షపాతం: 45.7 మిల్లీ మీటరు

వర్షం కురిసిన రోజులు: 3

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement