భారీగా ఈదురుగాలులు | - | Sakshi
Sakshi News home page

భారీగా ఈదురుగాలులు

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి ప్రాంతంలో ఆదివారం భారీగా ఈదురుగాలులు వీచాయి. పెద్దపల్లి మండలం అందుగులపల్లి, భోజన్నపేట గ్రామాల్లో కొంతమేర ఆస్తి నష్టం జరిగింది. అందుగులపల్లికి చెందిన కామ వెంకటి ఇంటిపై కప్పు ఎగిరిపోగా పైకప్పు రేకులు చెల్లాచెదురుగా పడ్డాయి. భోజన్నపేటలో విద్యుత్‌ తీగలు రాపిడి జరిగి చెలరేగిన మంటలు సమీపంలో ఉన్న కల్వల సంపత్‌, రాజయ్యలకు చెందిన వరిగడ్డి కుప్పలపై పడ్డాయి. వరిగడ్డికి నిప్పంటుకోవడంతో సమీపంలో ఉన్న ఇంటియజమానులు, గ్రామస్తులు హైరానా పడ్డారు. ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. వాహనం వచ్చినా అక్కడకు చేరుకునే మార్గంలేక పోవడంతో సమీపంలో ఉన్న వ్యవసాయబావి నుంచి నీటిని పైపుల ద్వారా తీసుకుని మంటలను అదుపు చేశారు. దీంతో గ్రామస్తులంతా ఊపిరిపీల్చుకున్నారు.

మెట్‌పల్లి పాఠశాలలో చోరీ

శంకరపట్నం: మండలంలోని మెట్‌పల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆదివారం పట్టపగలు చోరీ జరిగింది. ఉదయం పాఠశాలలో యోగా డే జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొని ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం గ్రామానికి చెందిన ఆరుగురు మైనర్లు కంప్యూటర్‌ గదులకు వేసిన తాళాలు పగులగొట్టి కంప్యూటర్లను ధ్వంసం చేశారు. రెండు సైకిళ్లు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణ చేపట్టి సైకిళ్లను పాఠశాలకు అప్పగించారు. రూ.లక్షలు విలువ చేసే కంప్యూటర్లను ధ్వంసం చేసిన ఘటనపై విచారణ జరుపుతున్నారు.

హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ కార్పొరేషన్‌ బీజేపీ కార్పొరేటర్‌ సోమిడి వేణుప్రసాద్‌పై ఈ నెల 18న గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 18 రాత్రి 11 గంటల ప్రాంతంలో తన బైక్‌పై కిసాన్‌నగర్‌లో రోడ్డుపై వెళ్తుండగా వెనుకవైపు నుంచి ఓ కారు అతివేగంగా ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిందని తెలిపాడు. కారులో ఇద్దరు వ్యక్తులున్నట్లు గమనించానని, తన బైకును ఢీకొట్టిన తరువాత మళ్లీ ఢీకొట్టేందుకు యత్నించారని ఆరోపించాడు. ఈ ఘటనలో తనకు తీవ్రగాయాలు కాగా, బైక్‌ ధ్వంసమైందని తెలిపాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని త్రీటౌన్‌ సీఐ తిరుమల్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement