రామగుండం: ఆటో కిరాయి విషయమై తలెత్తిన వివాదంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడి చేయడం చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం రామగుండం చేరుకున్న విజయ్‌కుమార్ అనే కార్మికుడు కరీంనగర్‌కు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆటోవాలాను సంప్రదించాడు. కిరాయి విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో విజయ్‌కుమార్‌పై ఆటో డ్రైవర్ దాడి చేయడంతో గాయపడ్డాడు. సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఉపక్రమించగా మిగతా ఆటోడ్రైవర్లు అతనిని వారించడంతో ఫిర్యాదు చేయకుండా వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా అస్వస్థత
● చాకచక్యంగా రోడ్డును దింపిన బస్సు
● ప్రభుత్వాసుపత్రికి డ్రైవర్ తరలింపు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం పెద్దకల్వల స్టేజీ సమీపంలోకి చేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ తిరుపతి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్న బస్సు (టీఎస్ 02 9326) నడుపుతున్న డ్రైవర్ తిరుపతికి కుడి చేయి కాలు పనిచేయకపోవడంతో హైరానా పడ్డాడు. వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. గమనించిన కండక్టర్ భారతి, బస్సులోని 25మంది ప్రయాణికులు వెంటనే డ్రైవర్ తిరుపతిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. డ్రైవర్ చాకచక్యంగా రోడ్డు పక్కన నిలపడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి
గంగాధర: గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్‌షాక్‌తో ఆరెపల్లి హన్మయ్య(60) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం విరిగిపడి, వైర్లు కింద పడిపోయాయి. బైక్‌పై వెళ్తున్న హన్మయ్య వైర్లు గమనించక ముందుకు కదిలాడు. కాళ్లకు తీగలు తగిలి విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.


