వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకుని రంగుబిల్లల జూదం పేరుతో అందినకాడికి ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జారుకుని మరోచోట జూదం నిర్వహిస్తూ వేలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు శనివారం రాత్రి వరంగల్ జిల్లా నుంచి ఓ కుటుంబం వేములవాడకు చేరుకుంది. ఆదివారం స్వామివారిని దర్శించుకున్నాక కుటుంబ సభ్యుల్లోని ఒకరు గుడి చెరువు పార్కింగ్ స్థలంలో నిర్వహిస్తున్న రంగుబిల్లల జూదం వైపు వెళ్లాడు. భక్తులు రద్దీగా ఉండే ఆది, సోమవారాల్లో జాతరగ్రౌండ్, ఓపెన్ పార్కింగ్ స్థలం ప్రాంతాల్లో రంగుబిల్లల జూదం రూ.100తో మొదలై రూ.5 వేల వరకు సాగుతోంది. ఇందులో నిర్వాహకులు మోసానికి పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదే తరహాలో ఆట ఆడుతూ ఏకంగా ఓ వ్యక్తి రూ.5 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో నగదు పోగొట్టుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుని నిర్వాహకులతో గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. నగదు పోగొట్టుకున్న కుటుంబానికి కొంత నగదు ఇచ్చి అక్కడ నుంచి నిర్వాహకులు జారుకున్నారు. అమాయక భక్తులను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున నగదు దోపిడీకి పాల్పడుతున్న జూదం అంశంపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
అమాయక భక్తులే టార్గెట్


