మానకొండూర్: రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రైతాంగం సంక్షోభంలో పడిందని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు అన్నారు. మానకొండూర్‌లో శనివారం మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం దేశానికి వెన్నెముకలా నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల వెన్నెముకనే విరగ్గొట్టే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతుబంధు, రైతు బీమా అమలులో అనిశ్చితి ఏర్పడిందన్నారు. దాదాపు 40 రకాల సన్న వరిధాన్యాలు ఉండగా, 7 రకాలకే బోనస్ ప్రకటించడం సరికాదన్నారు. రేవంత్ ఢిల్లీకి 71సార్లు వెళ్లి తెలంగా ణకు, ముఖ్యంగా రైతులకు ఏం సాధించారని ప్రశ్నించారు. కాళేశ్వరం నీటితో మధ్య మానే రు, దిగువ మానేరు నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, పారునంది కిషన్, దేవ సతీశ్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు పాల్గొన్నారు.
కలిసికట్టుగా నగర అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: నగర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని 53వ డివిజన్ శర్మనగర్‌లో సుడా నిధులు రూ.20 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. నగరంలోని అంతర్గత రోడ్లు , డ్రైనేజీలకు నిధులు వెచ్చించి ఎక్కడికక్కడ పనులను వేగవంతం చేయడం జరుగుతుందని అన్నారు. కార్పొరేటర్ కొంపెల్లి శ్వేత– రమణ, డీఈ రాజేంద్ర ప్రసాద్, మహమ్మద్ మేరాజ్, సమియోద్దీన్, హరికృష్ణ, అబ్దుల్ వసీం, అనిల్, రాము, శ్రీనివాస్, కలీం పాల్గొన్నారు.
ప్రేమపేరుతో యువత మోసపోవద్దు
కరీంనగర్‌కల్చరల్: ప్రేమ, వ్యామోహానికి మధ్య ఉన్న తేడాను గుర్తించి యువత ముందుకు సాగాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సంచాలకుడు జీవీ.శ్యామ్ ప్రసాద్ లాల్ సూచించారు. శనివారం ఫిలింభవన్‌లో సమతా సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన గండ్ర హనుమంతరావు స్మారక సాహిత్య పురస్కార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గండ్ర లక్ష్మణరావు తన తండ్రి పేరిట అందిస్తున్న ఈ పురస్కారాన్ని ‘ప్రేమలు’ నవల రచయిత్రి తటవర్తి నాగేశ్వరికి ప్రదానం చేశారు. ప్రేమకు, మోహానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ నవల ద్వారా చక్కగా వివరించారని అభినందించారు. కరిమిండ్ల లావణ్య, ఆడెపు లక్ష్మీపతి, కొత్తిరెడ్డి మల్లారెడ్డి, గాజుల రవీందర్, కొత్త అనిల్ కుమార్ పాల్గొన్నారు.
నేడు ‘పెద్ద బాడిసె’ పుస్తకావిష్కరణ
కరీంనగర్‌కల్చరల్: భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్‌లో ఆదివారం జరిగే సాహిత్య సభలో కరీంనగర్‌కు చెందిన కవి మియాపురం శ్రీనివాస్ రచించిన పెద్ద బాడిసె కవితా సంపుటిని రిటైర్డ్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్ ఆవిష్కరిస్తారని పెద్దిరాజు సత్యనారాయణ రాజు తెలిపారు. విశిష్ట అతిథిగా ప్రముఖ కవి, విమర్శకులు గంటా మనోహర్ రెడ్డి, ఆత్మీయ అతిథిగా బహు గ్రంథకర్త సంపత్ కుమార్, ప్రధాన వక్తగా ఎర్రోజు వెంకటేశ్వర్లు హాజరవుతారని అన్నారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.


