జిల్లాలో నిత్యం అవసరాలిలా..
పంటల సాగు సరళి ఇలా
కరీంనగర్ అర్బన్: రైతులు సాంప్రదాయ పంటలు కాకుండా మార్కెట్ అవసరాలను బట్టి సాగు చేయడం ప్రస్తుతం అవసరం. ఒకప్పుడు అనుములు, మినుములు, పెసలు, కందులు, జొన్నలు, రాగుల పంటలతో అలరారిన పొలాలు నేడు వరి, పత్తి పంటలకే పరిమితం అవుతున్నాయి.
ఇతర జిల్లాలు, రాష్ట్రాలపై ఆధారపడాల్సిందేనా.?
గత సీజన్‌లో 3.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 2.75 లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీంతో జిల్లాలో నిత్యావసరాలకు దిగుమతే గతి కానుంది. వ్యవసాయ నిపుణులు సైతం పంటల సాగు విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అవసరాలు, వినియోగంపై స్పష్టమైన విధివిధానాలు లేకపోవడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తున్నాయి.
పంట మార్పిడి.. క్రాప్ కాలనీల్లేవ్
జిల్లాలో సాగయ్యే పంటలకు సంబంధించి క్రాప్ కాలనీలుగా విభజించి పంటలను సాగుచేయించాలని గత ప్రభుత్వం 2017లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హడావుడి చేసిన అధికారులు మాటలకే పరిమితమవగా ఆచరణలో కరువైంది.
పప్పులు... కూరగాయల్లేవ్
అంతర్జాతీయంగా చిరు, తృణ ధాన్యాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ జిల్లాలో ఈ పంటల సాగు అందని ద్రాక్షే. చిరు, తృణ ధాన్యాలే కాకుండా కంది, మొక్కజొన్న, మినుము, పెసర, బబ్బెర లాంటి పంటలు సైతం అవసరం మేర పండించుకోలేకపోవడంతో వీటి ధరలు అమాంతం పెరిగి వినియోగదారుడిపై ఆర్థిక భారం పడుతోంది. నూనె గింజలకూ కొరత ఏర్పడుతోంది. ప్రజల వినియోగం మేరకు పంటలను ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికీ పంటల లోటు కనిపిస్తోంది. దీంతో నిత్యావసరాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండగా, ఇది రోజు రోజుకు జఠిలం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో గతంలో 5 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవగా వానాకాలం సీజన్‌లో కేవలం 571.84 ఎకరాల్లో సాగు చేయడం ఆందోళనకర పరిణామం.
ఇవన్నీ సాగు కాలే
ఏటా జిల్లాలో చాలావరకు పంటలు సాగవలేదని స్పష్టమవుతోంది. బజ్ర, శనగలు, ఆముదం, బీన్స్, బేర్, కొర్రలు, అవాలు, నిగర్(గడ్డి), పిల్లిపెసర, రాగులు, కుసుమ, చెఱకు, ఎండజనపనార, గోధుమలు, అల్లం, ఉల్లిగడ్డ, ముల్లంగి, పాలకూర, చిరుధాన్యాలు, ఫింగర్ మిల్లెట్, ఫాక్స్టెల్ మిల్లెట్, సామలు వంటి పంటలను సాగు చేయలేదు.
పంట పేరు ఎకరాలు
వరి 2,71,334
కందులు 904
మొక్కజొన్న 3681
మిరప 687
బబ్బర్లు 30
పెసలు 92
కూరగాయల సాగు విస్తీర్ణం 571.84 ఎకరాల్లో సాగయ్యాయి.
కంది పప్పు: 2,000 టన్నులు
పెసర పప్పు: 1,000 టన్నులు
కూరగాయలు: 2,625 టన్నులు


