ట్రాక్టర్‌ పైనుంచి పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ పైనుంచి పడి యువకుడి మృతి

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

కుమారుడి కళ్లు దానం చేసిన తండ్రి

వెల్గటూర్‌: ట్రాక్టర్‌ పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎండపల్లికి చెందిన తొట్ల మధూకర్‌ (26) తన పొలానికి పశువుల ఎరువు తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌ కిరాయి మాట్లాడుకున్నాడు. డ్రైవర్‌ అతివేగంగా.. అజాగ్రతగా నడపడంతో మధూకర్‌ అదుపు తప్పి కింద పడ్డాడు. ఘటనలో తల, చాతిపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

కన్నుమూసినా ఇద్దరికి చూపు

మధుకర్‌ మృతిచెందినా మరో ఇద్దరికి చూపునిచ్చాడు. మధూకర్‌ అవయవాలను దానం చేయాలని తండ్రి లచ్చయ్య నిర్ణయించుకుని ఎస్సై ఉదయ్‌కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ మారం జలంధర్‌ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి సిబ్బంది మధూకర్‌ నేత్రాలను సేకరించారు.

చికిత్స పొందుతూ ఒకరు..

మల్లాపూర్‌: మండలంలోని హుస్సేన్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేక్‌ ఖాసీం (19) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖాసీం తన బైక్‌పై రోడ్డుపై వెళ్తుండగా ఖానాపూర్‌ నుంచి మెట్‌పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఖాసీం తలకు తీవ్రగాయడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఖాసీం తండ్రి షేక్‌ నన్నేసాబ్‌ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌ గుగ్లావత్‌ గోపిచంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

కరీంనగర్‌క్రైం: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ తన కుమారుడు మహ్మద్‌ అహ్మద్‌(19)తో కలిసి ఉపాధి నిమిత్తం కరీంనగర్‌ వచ్చారు. నగరంలోని చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. ఇటీవల అహ్మద్‌ చికెన్‌సెంటర్‌కు రాకుండా బయట తిరుగుతుండడంతో శనివారం ఇర్ఫాన్‌ మందలించాడు. మనస్తాపానికి గురైన అహ్మద్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇర్ఫాన్‌ గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఇర్ఫాన్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

తాగుడు వద్దన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం: తాగుడు మానేయాలని భార్య మందలించినందుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిలి పెద్దొళ్ల చిన్న నర్సయ్య(43) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మధ్యం తాగి వచ్చి భార్య కవితతో గొడవ పడుతున్నాడు. ఇలాగైతే ఎలా అని కవిత మందలించగా.. మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. నర్సయ్యకు ఇద్దరు కూతుళ్లు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement