కరీంనగర్ అర్బన్: భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదా బైనామా, రీ– సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. భూధార్ సర్వే, భూభారతి, సాదా బైనామా, నాన్– కడాస్ట్రల్ గ్రామాల రీ–సర్వే, నక్షా తదితర అంశాలపై శుక్రవారం రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. భూధార్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి భూ యజమానికి ఖచ్చితమైన భూ వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి అర్హులైన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, భూములకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని పేర్కొన్నారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ భూ రికార్డుల ఆధునీకరణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయండి
లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో 25వ డివిజన్ పరిధి సుభాష్‌నగర్ ఏరియా, బుట్టి రాజారాం కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను డీఆర్వో స్వామి, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. బిల్లులు జమ కాని లబ్ధిదారుల వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ డీఈ వెంకటరమణ, ఏఈలు ఊర్మిల, వర్షిణి ఉన్నారు.
పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి
గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న జిల్లా ప్రధాన పశువుల ఆసుపత్రిని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రి ద్వారా పశువులకు అందిస్తున్న సేవలు, వాక్సినేషన్, మందుల వివరాలు తెలుసుకున్నారు. గదులు కలియ తిరుగుతూ ల్యాబరేటరీ, శస్త్ర చికిత్స గదులు, ఎక్స్‌రే గది, మందుల గది పరిశీలించారు. సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి ముందు శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని పరిశీలించి తొలగించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు నరేష్ కుమార్, వినోద్ కుమార్ ఉన్నారు.


