వ్యర్థాలకు ఉంది అర్థం | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాలకు ఉంది అర్థం

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

వేములవాడ: ప్లాస్టిక్‌ బాటిల్‌..కవర్‌.. కాదేది సృజనకు అనర్హం అన్నట్టుగా వేములవాడకు చెందిన సౌజన్య ప్లాస్టిక్‌ వ్యర్థాలను అందమైన కళాఖండాలుగా సృష్టిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్నారు. పనికిరాని ప్లాస్టిక్‌ వస్తువులను అందమైన కళారూపాలుగా మారుస్తున్నారు. పర్యావరణ ప్రేమికురాలిగా, ఒక వ్యాపారీగా సౌజన్య సరికొత్త ప్రయాణం చేస్తున్నారు.

ప్లాస్టిక్‌కు అందం

నేడు ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమికి శాపంగా మారాయి. ఎక్కడ చూసినా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌కవర్లు, బాటిళ్లతో పర్యావరణం కలుషితమవుతోంది. కానీ వేములవాడకు చెందిన సౌజన్య ఆ వ్యర్థాలనే తన ఉపాధికి మార్గంగా ఎంచుకున్నారు. అందరూ పారేసే ప్లాస్టిక్‌ వస్తువులకు తన సృజనాత్మకతను జోడిస్తున్నారు. అద్భుతమైన రెసిన్‌, క్రాఫ్ట్‌ ఆర్ట్‌, గులాబీల బొకేలుగా మారుస్తున్నారు.

ఆలోచన చిన్నది.. ఆశయం పెద్దది

సాధారణంగా ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు ఏదో ఒక చిన్న వ్యాపారం చేయాలనుకుంటారు. కానీ సౌజన్య మాత్రం వినూత్నంగా ఆలోచించింది. సమాజానికి మేలు చేస్తూనే, తనకు నచ్చిన రంగంలో రాణించాలనుకుంది. పర్యావరణాన్ని పాడుచేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి, వాటిని శుభ్రం చేసి రంగులు, విభిన్న అలంకరణలతో అద్భుతమైన గృహాలంకరణ వస్తువులుగా, బహుమతులుగా తయారు చేస్తున్నారు.

వ్యర్థాలే ఇక్కడ రంగుల కళాఖండాలు

సౌజన్య చేతిలో పడితే సాధారణ ప్లాస్టిక్‌ కూడా ఒక అపురూపమైన బహుమతిగా మారిపోతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పూల రేకులు, ముత్యాలను ఉపయోగించి అద్భుతమైన వాల్‌ హ్యాంగింగ్‌గా తయారు చేశారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల సహాయంతో నిజమైన గులాబీలను తలపించేలా రెడ్‌రోజ్‌ బొకేను రూపొందించారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు ఈ బొకేలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

స్వయం ఉపాధితో స్వావలంబన

ఇలా తయారు చేసిన వస్తువులను సౌజన్య స్థానికంగానే కాకుండా, సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఆర్డర్లు విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడికి తన ప్రతిభను జోడించి వ్యాపారం మొదలుపెట్టారు. ఈ వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తున్నారు. ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడటమే కాకుండా వేస్ట్‌ నుంచి బెస్ట్‌ ఎలా చేయాలో సమాజానికి చూపిస్తున్నారు.

ప్టాస్టిక్‌ బాటిల్‌, కవర్లతోనే అందమైన ఆకృతులు

వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్న సృజన

ఆదర్శం వేములవాడకు చెందిన అతివ

వేస్ట్‌లో బెస్ట్‌ నా లక్ష్యం

ప్లాస్టిక్‌ అనేది భూమికి హానికరం. దాన్ని పారేయకుండా ఇలా రీసైకిల్‌ చేసి అందమైన వస్తువులుగా మార్చితే పర్యావరణానికి మేలు జరుగుతుంది. మనకు ఉపాధి దొరుకుతుంది. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నా ఇన్‌స్ట్రాగామ్‌లో కానీ, 94418 61385లో సంప్రదిస్తే కస్టమర్‌ అభిరుచికి అనుగుణంగా తయారుచేసి అందిస్తాను.

– సౌజన్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement