మా ఊళ్లో బెల్ట్‌షాప్‌లు వద్దు | - | Sakshi
Sakshi News home page

మా ఊళ్లో బెల్ట్‌షాప్‌లు వద్దు

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

మంథని: పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యంతో అనేక కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. టీషాప్‌లకన్నా ముందే బెల్ట్‌షాపులు ప్రారంభిస్తూ.. అర్ధరాత్రి దాటాక కూడా యథేచ్ఛగా సాగుతున్నాయి. పల్లెలేకాదు.. పట్టణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. పోలీస్‌స్టేషన్లు, బడి, గుడికి సమీపంలోనే బెల్ట్‌షాప్‌లు నడుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వానికి అనధికారికంగా ఆదాయం సమకూర్చే మార్గం కావడంతో ఇలాంటి వ్యవస్థను నియంత్రించలేకపోతున్నారనే చర్చ సాగుతోంది. ఈక్రమంలోనే మద్యం విక్రయాలను నిషేధిస్తూ పంచాయతీ పాలకవర్గాలు తీర్మానించడం, ఇందుకు సహకరించాలని ఎకై ్సజ్‌ అఽధికారులకు వినతిపత్రాలు సమర్పించడం జోరందుకుంది.

మంథనిలో చైతన్యం

బెల్ట్‌షాపులకు వ్యతిరేకంగా మంథని మండలంలో చైతన్యం మొదలైంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి, గాజులపల్లిలో మద్యం విక్రయాలు వద్దని తీర్మానించారు. గాజులపల్లి సర్పంచ్‌ ఏకగా బెల్ట్‌షాప్‌ల ఎత్తివేతకు సహకరించాలని ఎకై ్సజ్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం మంథని మండలం మల్లేపల్లిలో బెల్ట్‌ దుకాణాలు మూసివేయాలని మాజీ సర్పంచ్‌ ఎరుకల తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఆర్డీవో సురేశ్‌కు మహిళలు వినితిపత్రం అందించారు. బెల్ట్‌షాప్‌లతో యువత మద్యానికి బానిస అవుతోందని, కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు పెచ్చుమీరుతున్నాయని, శాంతిభద్రలు అదుపుతప్పుతున్నాయని విన్నవించారు. మంథని ప్రాంతంలో మహిళలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా చేపట్టిన ఈ ఉద్యమం వివిధ గ్రామాలకూ విస్తరిస్తోంది.

ఒక్కో గ్రామంలో ఐదు వరకు..

జిల్లాలో 266 పంచాయతీలతోపాటు, రామగుండం కార్పొరేషన్‌, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 77 మద్యం దుకాణాలు, 9 బార్‌, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. వీటితోపాటు ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదు బెల్ట్‌షాపులూ ఉన్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్‌లోనూ 10 –15వరకు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో వైన్స్‌షాపులు తెరుకవముందే బెల్ట్‌ దుకాణాలు తెరచుకోవడం, మూసివేసినా.. లభ్యమవుతుండడంతో మద్యం ప్రియులు మత్తులో మునిగితేలుతున్నారు. గ్రామాల్లోనూ బెల్ట్‌ దుకాణాలు కిరాణాల్లో నడుస్తున్నాయి. దీంతో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అందుబాటులో ఉంటుంది.

నియంత్రణ చర్యలు శూన్యం

అనేక అనర్థాలకు బెల్ట్‌షాప్‌లు కారణవుతున్నాయని తెలిసినా పోలీస్‌, ఎక్సైజ్‌ తదితర శాఖలు నిస్సహా య స్థితిలో ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలోనే బెల్ట్‌ దుకాణాల నిర్వాహకులను బైండోవర్‌ చేయడం, ఆ తర్వాత వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. పైగా బెల్ట్‌షాప్‌లు దక్కించుకోవడానికి గ్రామాల్లో వేలం పాటలు కూడా చోటుచేసుకోవడం గమనార్హం. వీటి నిర్వాహకులు కొన్ని గ్రామాల్లో అభివృద్ధికి సహకరిస్తున్నట్లు సమాచారం. దీంతో మద్యం దుకాణాలకు ఆటంకం లేకుండా నడుస్తున్నాయని అంటున్నారు.

బెల్ట్‌షాప్‌లు తొలగించాలని ఎకై ్సజ్‌ అధికారికి వినతిపత్రం అందిస్తున్న గాజులపల్లి సర్పంచ్‌ సుధాకర్‌, స్థానికులు

మంథని ఆర్డీవో సురేశ్‌కు వినతిపత్రం అందిస్తున్న మల్లేపల్లి మహిళలు

గ్రామ పంచాయతీల తీర్మానం

అధికారులకు వినతిపత్రాలు

పల్లెవాసుల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం

స్వచ్ఛంద నిర్ణయాలపై అభినందనలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement