రామగుండం: ‘అమ్మా..నాన్నా.. నన్ను, తమ్ముడిని ఒంటరిగా చేసి వెళ్తున్నారు.. మీరు ఇకలేరని మానసిక వికలాంగుడైన తమ్ముడికి ఎలా చెప్పేది.. నన్ను స్కూల్‌కు ఎవరు తీసుకెళ్తరు? ఎవరి దగ్గరుండాలి?నాకూ, తమ్ముడికి చాక్లెట్లు, స్వీట్లు తేవాలని ఎవరినడగాలి.. మీరు వెళ్లిపోతున్నారనే మాకు ఆటబొమ్మలు తీసుకొచ్చారు కదా?’ అని తల్లిదండ్రులను కోల్పోయిన లోహిత(9) రోదించడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది. హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి అంత్యక్రియలు శుక్రవారం అంతర్గాంలో జరిపించారు.
రెండు కుటుంబాల్లో తీరని విషాదం..
హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు రేఖ, జయ పిల్లలతో కలిసి నాలుగు రోజుల క్రితం గోదావరిఖనిలోని తమ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వేసవి సెలవులు ముగియడంతో బుధవారం వేములవాడ, కొండగట్టులో దైవ దర్శనం చేసుకున్నారు. అదేరాత్రి ఒక కారులో ఊశెట్టి చంద్రశేఖర్–రేఖ దంపతులతోపాటు వారి కుమారుడు లోహిత్, రేఖ చెల్లెలి కుమారుడు జన్ను నిహాల్(3)తో కలిసి హైదరాబాద్ బయలు దేరారు. లోహిత తన చిన్నమ్మ జయ కారులో కూర్చుంది. గురువారం వేకువజామున మేడ్చల్ జిల్లాలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రశేఖర్–రేఖ, జన్ను నిహాల్ మృతిచెందారు. లోహిత్ కుడికాలు విరిగి అపస్మారక స్థితికి చేరగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చంద్రశేఖర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు
ఊశెట్టి చంద్రశేఖర్ జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. స్పోర్ట్స్ కోటాలోనే పోలీసు ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో రైల్వే ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య రేఖ గృహిణి, ఫుట్‌బాల్‌పై మక్కువ ఉండడంతో మృతదేహంపై క్రీడా దుస్తులు, ఫుట్‌బాల్ ఉంచి దహన సంస్కారాలు పూర్తిచేశారు.
జయ, రేఖ ట్విన్స్
జన్ను రవీందర్ – జయ, చంద్రశేఖర్ – రేఖ తోడల్లుళ్లు. జయ, రేఖ ట్విన్స్. రవీందర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. జయ అక్కడే ట్రాన్స్‌కో ఏడీఈ. వీరి స్వగ్రామం జమ్మికుంట. వీరి కుమారుడు నిహాల్ ప్రమాదంలో మృతిచెందాడు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
కుమారుడి మృతదేహాన్ని
మోస్తున్న తల్లిదండ్రులు
తల్లిదండ్రుల మృతదేహాలకు కొరివి పెట్టేందుకు నిప్పు మోస్తున్న కూతురు లోహిత
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు
మూడేళ్ల కుమారుడిని కోల్పోయిన దంపతులు
విషాదం నింపిన హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం
ముగిసిన ముగ్గురి అంత్యక్రియలు


