ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లిలోని మూలమలుపు వద్ద శుక్రవారం రాత్రి గోదావరిఖని నుంచి ముత్తారానికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ కూలీ దుర్మరణం చెందాడు. ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన రేండ్ల తిరుపతి(35) అనే కూలీ ఆర్ అండ్ బీ రోడ్డు పనులు చేయడానికి ముత్తారానికి వచ్చాడు. రోడ్డుకు వైట్ పెయింట్ వేసి కేశనపల్లి వద్ద మూలమలుపు వద్ద ఆగాడు. ఈక్రమంలో తిరుపతిని ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించామని, ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై రవికుమార్ తెలిపారు.
మోసం చేసిన వ్యక్తుల అరెస్ట్
జగిత్యాలక్రైం: బంగారం అమ్మిస్తానని నమ్మించి మోసం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన గండి లలిత కుమారుడి ఆరోగ్యం బాగా లేనందున జగిత్యాల పట్టణంలోని జంబిగద్దె ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో ఈనెల 16న జాయిన్ చేసింది. ఆస్పత్రి బిల్ కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో మెడలోని బంగారు పుస్తెలు, గుండ్లు అమ్ముదామని అనుకుంటుండగా శుక్రవారం ఆమెకు పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు బంగారం అమ్మి డబ్బులు తీసుకువస్తామని నమ్మించి బంగారంతో పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై సుప్రియ కేసు నమోదు చేశారు. కొత్తబస్టాండ్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాత్రాజ్‌పల్లికి చెందిన కత్తెరపాక దేవేందర్, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నంద్యాల తిరుపతిరావును పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
చేపలవేటకు వెళ్లి.. కరెంట్ షాక్‌తో మృతి చెంది..
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మినుగు రమేశ్(36) శుక్రవారం చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రమేశ్ తన తమ్మడు నరేశ్‌తోపాటు మరో ఇద్దరు కలిసి చేపలు పట్టేందుకు స్థానిక కుంటకు చేరుకున్నారు. అక్కడ కరెంట్ షాక్ పెట్టి చేపలుపట్టే క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి కొమురమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని మద్ధిర్యాల గ్రామానికి చెందిన మల్క రాజేశ్వరరావు అనే రైతుకు చెందిన ఎద్దు శుక్రవారం పంట పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఎద్దు విలువ రూ.యాభై వేల వరకు ఉంటుందని రైతు పేర్కొన్నాడు. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని కోరాడు.


